17 May, 2026 | 1:20 AM

బీసీల రాజ్యం తెచ్చి తీరుతా

17-05-2026 12:00 AM
  1. మారోజు వీరన్న ఆశయ సాధనే లక్ష్యం 
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

సూర్యాపేట, మే 16 (విజయక్రాంతి): 2029లో బీసీల రాజ్యం తెచ్చి తీరుతానని, మారోజు వీరన్న ఆశయ సాధనే లక్ష్యమని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం సూర్యాపేటలో బహుజన రాజ్యస్థాపన ఉద్యమ నేత మారోజు వీరన్న 27వ వర్ధంతిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్మారక సభలో మారోజు వీరన్న ఆశయాలు, బహుజనుల హక్కులు, అమరుల కుటుంబాల త్యాగాలను తీన్మార్ మల్లన్న  స్మరించుకున్నారు.

అంతకుముందు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం డలంలో మారోజు వీరన్న గ్రామమైన కరివిరా ల కొత్తగూడెంలోని వీరన్న స్థూపాన్ని వీరన్న అనుచరుల కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్న మల్లన్న అమరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలోని గాంధీ పార్కులో మారోజు వీరన్న నాటిన విత్తనమే నేటి తెలంగాణ రాష్ట్రానికి మూలకారణం అని గుర్తు చేశారు.

మారోజు వీరన్న లేకపోతే నేడు తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్, ఆయన కుటుంబం రాజకీయాల్లో ఉం డేవారు కాదని స్పష్టం చేశారు. కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కాకుండా, కురుమ, యాదవ, మాదిగ, మాల వంటి బహుజనులు ముఖ్యమంత్రులు అయ్యే సామాజిక తెలంగాణను వీరన్న కోరుకున్నారు అన్నారు.

లక్షల సంవత్సరాల క్రితం నాటి ఎముకలను మనుషులుగా గుర్తిస్తున్న ప్రపంచం, తెలంగాణ గడ్డపై ఉన్న ముదిరాజ్, పద్మశాలి, గౌడ్, వడ్డెర, మంగలి వంటి కులాలను అగ్రవర్ణాలైన రెడ్లు, వెలమలు మనుషులుగా చూడకపోవడాన్ని వీరన్న తీవ్రంగా ప్రశ్నించారన్న విషయాన్ని తెలియజేశారు.

సమాజం కోసం, ప్రజల ఆకలి తీర్చడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన బిడ్డల ఫోటోలను పట్టుకుని తల్లులు నేడు సూర్యాపేట గడ్డపై కన్నీటితో ఎదురుచూస్తున్నారని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్కౌంటర్ల పేరుతో ఎంతోమంది బహుజన బిడ్డలను పొట్టనబెట్టుకున్నారు గుర్తు చేశారు. భువనగిరిలో తెలంగాణ కోసం పాట పాడిన యాదవ ఆడబిడ్డ బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికించి చంపించిన ఘనత చంద్రబాబుదే అని ఆయన ఆరోపించారు. బహుజనులు రాజ్యాధికారం అడిగితే తట్టుకోలేని దొరల అహంకారం తెలంగాణలో రాజ్యమేలుతోంది. 

తాను ఎన్నికల్లో కత్తెల గుర్తుపై పోటీ చేసినప్పుడు, తన ఆఫీసుపై దాడి జరిగిన విషయాన్ని కాల్పులు జరిగిన విషయాన్ని మల్లన్న గుర్తు చేశారు. నాడు బహుజనుల కోసం పోరాడిన మారోజు వీరన్న ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు అలాగే నేడు బహుజనుల కోసం పోరాటం చేస్తున్న నన్ను అంతమొందించాలని నా ఆఫీస్‌పై దాడి చేశారని తెలిపారు. అమరుల కుటుంబాల ను పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మల్లన్న.. 2029 నాటికి తెలంగాణలో బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసి, అధికార పీఠంపై బహుజనుల జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.