7 August, 2026 | 7:14 PM

ఆగస్టు 10న జైల్ భరో

07-08-2026 06:31 PM

- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జమ్మిశెట్టి శంకర్ గౌడ్

బోధన్,(విజయక్రాంతి): ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జమ్మిశెట్టి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత 12 సంవత్సరాలుగా వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు కనిపించడం లేదన్నారు.

కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరగడంతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అలాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో వారు ఉపాధి కోసం అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గనులు, బ్యాంకులు, రైల్వే, ఎల్‌ఐసీ, రక్షణ రంగం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీ సోమవారం జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆటో వర్కర్లు, హమాలీలు, ఆస్పత్రి కార్మికులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఐకేపీ వర్కర్లు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, షాపు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వాచ్‌మెన్‌లు తదితర అన్ని రంగాల కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జంగం గంగాధర్, సీఐటీయూ నాయకులు గోవింద్ సాగర్, రైతు సంఘం నాయకులు పత్రి ఎల్లయ్య, కాడి సాయిలు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.