26 June, 2026 | 2:27 AM

ఒక ప్రాణం తీసి మరో ప్రాణాన్నీ బలిగొంది

26-06-2026 01:00 AM
  1. ఒకరు విద్యుత్ షాక్‌తో.. మరొకరు ఉరేసుకొని..
  2. ఇద్దరు ఒకే పొలంలో మృతి చెందడంతో విషాదం 

టేకులపల్లి, జూన్ 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం విద్యుత్ షాక్తో మహిళ మృతి చెందిన ఘటన మరవక ముందే మరుసటి రోజే అదే పొలంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకుకున్నాయి. బోడు గ్రామ పంచాయతీ సర్పం పోదేం స్వరూప అత్త పొదెం చుక్కమ్మ (55) బుధవారం మొక్కంపాడు గ్రామ సమీపంలోని ఓ పత్తి పొలంలో కూలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో చేనుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటే ప్రయత్నంలో విద్యుత్ ప్రవహిస్తున్న తీగ తగలడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు.

తోటి కూలీలు వెంటనే ఆమెను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. అయితే ఈ ఘటన వెనుక ఉన్న పరిస్థితులు గ్రామంలో మరింత విషాదానికి కారణమయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. బోడు గ్రామానికి చెందిన మాడె పాపయ్య పొలంలో ఫెన్సింగ్ కి విద్యుత్ సరఫరా కావడంతో.. అదే విద్యుత్ ఫెన్సింగ్ వైర్కు విద్యుత్ ప్రవహించి చుక్కమ్మ మృతి చెందడంతో.. ఈ ఘటనలో తనపై కేసు నమోదవుతుందనే భయంతో, తీవ్ర మనస్తాపానికి గురైన మాడె పాపయ్య గురువారం చేనులో ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పాపయ్య మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒక కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చిన విద్యుత్ ప్రమాదం, మరో కుటుంబంలోనూ విషాదాన్ని నింపడం స్థానికులను కలచివేసింది.