12 June, 2026 | 11:52 PM

ఫుట్ పాత్ వ్యాపారులకు నోటీసులు సమంజసం కాదు: పండూరి వీరబాబు

12-06-2026 07:47 PM

దమ్మపేట,(విజయక్రాంతి): పంచాయతీ పాలక వర్గం ప్లాట్ ఫామ్ మీద బ్రతికే కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు  పండూరి వీరబాబు హెచ్చరించారు. మండల కేంద్రంలో దమ్మపేట రోడ్డుకు ఇరువైపులా పొట్టకూటికోసం డ్రైనేజీ మీద షాపులు పెట్టుకొని  బ్రతికే కార్మికుల మీద పంచాయతీ తక్షణమే ఖాళీ చేయాలని షాపులకు నోటీసులు పంపించడం దుర్మార్గమన్నారు. కార్మికులను, వారి కుటుంబాలను రోడ్డు మీద పడవేయాలని పంచాయతీ నిర్ణయించుకుందా అని ప్రశ్నించారు.

కొన్ని సంవత్సరాలుగా ప్లాట్ఫారాల మీద వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని, వారిని ఉన్న పళంగా ఖాళీ చేయమనడం సమంజసం కాదని అన్నారు. వారికి వేరే ఎక్కడైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న సంతపాకల స్థలంలో షెడ్లు నిర్మించి ప్లాట్ఫారం మీద బ్రతికే వారికి ఆసరా కల్పించాలని అన్నారు.  డ్రైనేజీల మీద బ్రతికే వారినకి ప్రత్యామ్యాయం చూపించ కుండా తొలగించాలని చూస్తే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.