28 May, 2026 | 1:26 AM

మిల్లెట్ బిస్కట్ యంత్రం మూలకు?

28-05-2026 12:16 AM
  1. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మరమ్మతులు కరువు..
  2. కొనుగోలు చేసిన మూడు నెలలకే మూలన పడ్డ యంత్రాలు 

ఉట్నూర్, మే 27( విజయ క్రాంతి ) రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో మహిళలను ప్రోత్సహించడంతోపాటు వారికున్న అభిరుచులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి యూనిట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అధికారులు.. ఇంతవరకు బాగే ఉన్నా.. కంపెనీల నుండి కొనుగోలు చేసిన యంత్రాలు రెండు మూడు నెలలు సక్రమంగా నడిచి మూలన పడిపోతున్నాయి.. కంపెనీలలో కొనుగోలు చేసిన యంత్రాలకు ఏడాది నుంచి మూడేళ్ల పాటు యంత్రాన్ని బట్టి గ్యారంటీ ఇస్తారు.

కానీ కొంతమందికి సరఫరా చేసిన యంత్రాలు పనిచేయక పోవడంతో అనుకున్న లక్ష్యాన్ని పొదుపు సంఘాల మహిళలు చేరుకోలేక పోతున్నారు. అందుకు నిదర్శనంగా అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల సమైక్య లో ఉన్న పొదుపు సంఘాల మహిళలకు మిల్లెట్ బిస్కెట్ తయారీ కేంద్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్శి షా లు ప్రారంభించారు. ఇంద్రవెల్లి మండల సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్ లను ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో పనిచేసే గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు.

ఇంద్రవెల్లి లో తయారు చేసే బిస్కెట్లను ఆశ్రమ పాఠశాలలతో పాటు బయట మార్కెట్లో విక్రయించేందుకు డి ఆర్ డి ఓ పి డి రవీందర్ రాథోడ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నెలల పాటు పనిచేసిన యంత్రాలు మూలన పడడంతో ఇంద్రవెల్లి మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు బిస్కెట్ల తయారీ కొరకు నానా అవస్థలు పడుతూ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికైనా మూలన పడిన యంత్రాలను కంపెనీ వారు తీసుకువెళ్లి కొత్త యంత్రాలను సరఫరా చేయాలని పొదుపు సంఘాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చిరుధాన్యాలు ( మిల్లెట్) బిస్కెట్లు తయారు చేసేందుకు చిరుధాన్యాలను బయట ఫ్లోర్ మిల్లులో పిండి చేసుకుని తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని మండల సమైక్య అధ్యక్షురాలు మెస్రం లలిత, కార్యదర్శి రౌత్ మనిషా లు తెలిపారు.