16 May, 2026 | 1:26 AM

హైవేపై తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. కుటుంబం సురక్షితం

16-05-2026 12:18 AM

భిక్కనూర్, మే 15 (విజయక్రాంతి): జాతీయ రహదారి44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్కు చెందిన ఒక కుటుంబం హ్యుందాయ్ క్రెటా కారులో హైదరాబాద్ వైపు ప్రయాణిస్తోంది. అదే సమయంలో ముందుగా వెళ్తున్న లారీ యూటర్న్ తీసుకునేందుకు కుడివైపు మలుపు తిరగగా, వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా లారీని ఢీకొట్టింది.

ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయి లారీ వెనుక టైర్ల వరకు చొచ్చుకుపోయింది. అయితే కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చింది. ప్రమాదం జరిగిన తీరును చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జీఎంఆర్ సిబ్బంది సహకారంతో ట్రాఫిక్ను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం లారీలో ఇరుక్కున్న కారును బయటకు తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.