calender_icon.png 23 February, 2026 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బజాజ్ ఫైనాన్స్ బిగ్ స్కామ్?

23-02-2026 12:40:43 AM

లక్షల రూపాయలతో రికవరీ మేనేజర్ పరార్!

కోదాడ, ఫిబ్రవరి 22 : కొదాడ పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో రికవరీ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి లోన్ బకాయిల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన కలకలం రేపింది. శనివారం బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన కాసాని శ్రీను తన లోన్ బకాయిలు చెల్లించేందుకు ఫోన్పే ద్వారా రూ.1 లక్షను గంగిశెట్టి వెంకటేష్ అనే వ్యక్తికి బదిలీ చేసినట్లు తెలిపారు.

అయితే చెల్లింపుకు సంబంధించి ఎలాంటి అధికారిక రసీదు ఇవ్వకుండా, కంపెనీ ఖాతాకు కాకుండా వ్యక్తిగత ఫోన్పే నంబర్కు డబ్బులు పంపాలని సూచించాడని ఆరోపించారు. రసీదు కోరగా తర్వాత ఇస్తాం అంటూ తప్పించుకున్నాడని, కొద్ది రోజులకే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం కలిగిందన్నారు. తదుపరి కార్యాలయానికి వెళ్లి విచారణ జరపగా, సంబంధిత వ్యక్తి తమ సిబ్బందిలో లేడని, తమకు సంబంధం లేదని సిబ్బంది చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా మరికొందరు కూడా డబ్బులు చెల్లించి మోసపోయినట్లు వెల్లడించడంతో విషయం బయటపడింది.

పదుల సంఖ్యలో బాధితులు కార్యాలయం ఎదుట చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుల ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కంపెనీ రీజనల్ మేనేజర్ అక్కడికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు.

పూర్తిస్థాయి విచారణ జరిపి డబ్బులు చెల్లించిన వారికి న్యాయం చేస్తామని, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రీజనల్ మేనేజర్ హామీతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. లోన్ చెల్లింపులు చేసే సమయంలో అధికారిక ఖాతాల ద్వారానే చెల్లింపులు చేయాలని, తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.