26 August, 2026 | 3:25 AM

అధికారుల నిర్లక్ష్యంతో అవకతవకలు: 18వ వార్డు కౌన్సిలర్ సుగుణాకర్

25-08-2026 09:48 PM

జనగామ,(విజయక్రాంతి): జనగామ పట్టణంలోని 18వ వార్డులో సీడీఎంఏ  నిధులతో చేపట్టిన మురుగు కాలువ (డ్రైనేజీ) నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్ మండిపడ్డారు. రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో, సరైన లెవలింగ్ లేకుండా కాలువ నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వల్ల ఇళ్లలోని మురుగునీరు బయటకు పోకపోగా, పైగా కాలువలోని మురుగునీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమస్యపై ఏఈ, డీఈలకు ఫోటోలు తీసి పంపి పలుమార్లు హెచ్చరించినా వారు పట్టించుకోలేదని, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన మున్సిపల్ కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని కౌన్సిలర్ సుగుణాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూశా పర్వతాలు, కౌన్సిలర్ పానుగంటి సువార్త పాల్గొన్నారు.