భారత్‌లో 4.53 లక్షల కోట్ల పెట్టుబడులు
- ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ భేటీ
- వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగమవుతామన్న ఆండీ
న్యూఢిల్లీ, జూన్ 25: భారత్‌లో 2026 నుంచి 2030 మధ్య 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను (రూ.4.53 లక్షల కోట్లు) అమెజాన్ ప్రకటించింది. గురువారం అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం సంస్థ పెట్టుబడుల ప్రకటనను విడుదల చేసింది. ప్రధాని మోదీ ప్రకటనను స్వాగతించారు. దేశ యువతకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా భారత్ పెట్టుబడుల ఆసక్తిని పెంచుతోందని మోదీ అన్నారు.
జాస్సీ ‘ఎక్స్’ వేదికగా తన ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీతో సమావేశం ఎంతో బాగా జరిగిందన్నారు. ఆయన దార్శనికత అయిన ‘వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత్ వృద్ధి ప్రస్థానంలో దీర్ఘకాలిక భాగస్వామిగా కొనసాగుతామని స్పష్టంచేశారు. భారత్‌లో భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నాయకత్వానికి జస్సీ ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశ డిజిటల్ పరివర్తన, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి అమెజాన్ కట్టుబడి ఉందన్నారు. వినియోగదారులు, విక్రేతలు, డెవలపర్లు, స్టార్టప్ వంటి అనేక సంస్థలకు సేవలందిస్తున్నామన్నారు. ఈ పెట్టుబడుల నిర్ణయంతో మున్ముందు మరిన్ని సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. ప్యాకేజింగ్, ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నామని, తద్వారా భారత్‌లో సంస్థ సాంకేతిక ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటామని తెలిపారు.
3.8 మిలియన్ల ఉద్యోగాలు, 80 బిలియన్ డాలర్ల విలువైన ఈ కామర్స్ ఎగుమతులు, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా అమెజాన్ పెట్టుకుంది. గత కొన్నేళ్లుగా భారత్‌లో 12 మిలియన్ చిన్నవ్యాపారాలను డిజిటలైజ్ చేశామని, 20 బిలియన్ డాలర్ల ఈ కామర్స్ ఎగుమతులు సాధించామని, పరోక్షంగా 2.8 మిలియన్‌ల ఉద్యోగాలు లభించాయని, 10 మిలియన్ భారతీయులకు క్లౌడ్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చామని అన్నారు. అమెజాన్ పెట్టుబడులతో ముంబై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని భారీగా విస్తరించనున్నట్లు వ్యాపారవేత్తలు భావిస్తున్నారు.






