పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు
- 36 పేజీలదైతే ఇక రూ.2,500
- తత్కాల్‌లో రూ.5,000
- 60 పేజీలదైతే రూ.3,500
- తత్కాల్‌లో రూ.6వేలు
- జూలై 1 నుంచి అమలు
- కేంద్ర విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ, జూన్ 25: పాస్‌పోర్ట్ పొందడం మరింత ఖరీదైంది. ఫీజులను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెంచిన ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 36 పేజీల పాస్‌పోర్టుపై ఏకంగా రూ.1,000, అదే 60 పేజీల పాస్‌పోర్టుపై 1,500 పెంచింది. దీంతో 36 పేజీల పాస్‌పోర్టుకు గతంలో రూ.1,500 ఉండగా, ప్రస్తుతం రూ.2,500కు పెరిగింది. తత్కాల్‌లో పొందాలంటే రూ.5వేలుగా నిర్ణయించింది.
60 పేజీలకు రూ.2వేల నుంచి రూ.3,500 ఖరారు చేసింది. తత్కాల్‌లో పొందాలంటే రూ.6వేలుగా నిర్ణయించింది. తత్కాల్ ఫీజును రూ.3,500 నుంచి రూ.6వేలుగా నిర్ణయించింది. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్టు ఫీజు రూ.1,000 ఉండగా, ప్రస్తుతం రూ.1,750 వసూలు చేయనుంది. తత్కాల్‌లో పొందాలంటే ఫీజు రూ.4,250గా నిర్ణయించింది.
అదే సమయంలో 36 పేజీల పాస్‌పోర్టు పోగొట్టుకున్నట్లయితే తిరిగి పొందేందుకు రూ.5,000, తత్కాల్‌లో పొందాలంటే రూ.7,500, 60 పేజీల పాస్‌పోర్టు పోగొట్టుకున్నట్లయితే రూ.6000, తత్కాల్‌లో పొందాలంటే రూ.8,500గా నిర్ణయించింది. ఇతర అత్యవసర సేవలకు గాను పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.750, గుర్తింపు పత్రానికి రూ.1000, విదేశాలలో అత్యవసర ధ్రువీకరణ పత్రం పొందాలంటే 15 అమెరికన్ డాలర్లను చెల్లించుకోవాల్సి ఉంటుందని కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.






