24 April, 2026 | 1:48 AM

ఏయూలో ఇంట్రా కాలేజ్ కోడింగ్ పోటీ నిర్వహణ

24-04-2026 12:17 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విభాగానికి చెందిన కోడింగ్ కబ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోడ్స్ప్రింట్ 2026 అనే ఇంట్రా కాలేజ్ కోడింగ్ పోటీని అనురాగ్ యూనివర్సిటీ ఐబ్లాక్ 210, 310 కంప్యూటర్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమం హ్యాకర్ ర్యాంక్ సహకారంతో మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే నిర్వహించబడింది. ఈ పోటీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం మొదటి సంవత్సరం విద్యార్థులలో ప్రోగ్రామింగ్ మౌలిక నైపుణ్యాలను బలోపేతం చేయడం, తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించడం, అలాగే పోటీ కోడింగ్కు ప్రారంభ దశలో పరిచయం కల్పించడం.

ఈ పోటీని సి ప్రోగ్రామింగ్ మౌలిక సూత్రాలపై ఆధారపడి రూపొందించడంతో, ప్రారంభ స్థాయి విద్యార్థులకు అనుకూలంగా నిలిచింది. ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యలో తొలి దశ నుంచే బలమైన ప్రోగ్రామింగ్ పునాదులు అవసరమని పేర్కొన్నారు. హ్యాకర్య్రాంక్ వంటి పోటీ కోడింగ్ వేదికలు విద్యార్థులలో సమస్య పరిష్కార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈపోటీకి 163 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు నమోదు చేసుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.

నిర్ణీత సమయంలో కోడింగ్ సమస్యలను పరిష్కరించడంలో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు మరియు గిఫ్ట్ లు అందజేయగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అకాక్షత (ఐటి), వైభవ్ (ఏఐ), సూర్య (ఏఐ) లకు నగదు బహుమతులు, ప్రత్యేక అభినందనలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ పద్మిని సమర్థవంతంగా సమన్వయం చేయగా, స్టూడెంట్ కోఆర్డినేటర్  వివేక్ రెడ్డి సహకారం అందించారు.