7 August, 2026 | 5:23 AM

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

07-08-2026 01:31 AM

క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా చోరీలు

రూ.10 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

సిద్దిపేట క్రైం, ఆగస్టు 6 (విజయక్రాంతి): ‘అత్యవసరంగా వెళ్లాలి, డబ్బులు ఎక్కువ తీసుకున్నా పరవాలేదు’ అనిట్యాక్సీ డ్రైవర్లను ఒప్పిస్తాడు... మార్గమధ్యంలో ఏదో ఓ వంకతో కారు ఆపించి, ఏసీ ఆన్ లో ఉంచమని చెప్పి డ్రైవరుకు పని పురమాయిస్తాడు... డ్రైవర్ దిగి కొంత దూరం వెళ్లగానే సదరు దొంగ కారులో ఉడాయిస్తాడు.. ఈ తరహాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

అతడు నుంచి రూ.10 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన పెండ్యాల సుదర్శన్(32) అనే యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్. జూలై 2న రాత్రి ఎల్బీనగర్ ఫ్లైఓవర్ కింద క్యాబ్ బుకింగ్ కోసం వేచి ఉన్న వికారాబాద్ జిల్లా భోంరస్పేటమండలానికి చెందిన ఓలా క్యాబ్ డ్రైవర్ అంగోత్ తుల్జాతో కొమురవెల్లి పుణ్యక్షేత్రం వెళ్లిరావడానికి కారు మాట్లాడుకున్నాడు.

తిరుగుప్రయాణంలో మంగోల్ ఎక్స్ రోడ్ వద్ద డ్రైవర్ తుల్జా మూత్ర విసర్జన కోసం కారు పక్కన ఆపాడు. ఏసీ ఆన్ లో ఉంచమని చెప్పిన సుదర్శన్ డ్రైవర్‌దిగగానే కారును వేగంగా నడుపుకుంటూ పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏసీపీ నర్సింలు పర్యవేక్షణలో ఎస్‌ఐ బాలకృష్ణపోలీసు సిబ్బంది సీసీ టీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో సుదర్శన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడికి 2019 నుంచి సుదీర్ఘ నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. గజ్వేల్లో రూ. 50,000 దొంగిలించి మొదటిసారి జైలుకు వెళ్లిన సుదర్శన్, ఆ తర్వాత గజ్వేల్, నార్సింగి, ఎస్సార్ నగర్, చైతన్యపురి, ఖమ్మం, భద్రాచలం, మధురానగర్, మలకపేట, నకిరేకల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు వాహన దొంగతనాలకు పాల్పడి చంచల్గూడ జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

నిందితుడి నుంచి స్విఫ్ట్ డిజైర్, టోయోటా ఏటీఎస్ కార్లు, రాయల్ ఎన్ఫీల్ హంటర్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కుకునూరుపల్లి సీఐ లతీఫ్, ఎస్‌ఐ బాలకృష్ణ, కానిస్టేబుళ్లు రమేష్, రాజు, శివ, రాజేష్, రత్నాకర్, చంద్రం, ఐటీ కోర్ కానిస్టేబుల్ శ్రీకాంత్, ఇతర పోలీస్ సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.