7 August, 2026 | 3:32 AM

ఖజానా కష్టాలు

07-08-2026 01:18 AM

ఒకవైపు ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలకు భారీ వ్యయం.. మరోవైపు మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్, పారిశ్రామిక కారిడార్లకు, వేల కోట్ల రూపాయల అవసరం. రైతు సంక్షే మం, మహిళలకు సంబంధించిన పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యా-- వైద్య రంగాలపై భారీ వ్యయం కొనసాగుతుండగా, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుల భారం గణనీయం గా ఉండటంతో పాటు ప్రతి ఏడాది వడ్డీ చెల్లింపులు కూడా భారీ స్థాయి లో పెరుగుతున్నాయి. దీనికి తోడు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వివిధ శాఖల పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, విద్యుత్ సబ్సిడీల వ్యయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మరోవైపు జీఎస్‌టీలో రాష్ట్ర వాటా, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరగకపోవడం కూడా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేస్త్తున్నాయి.

దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రుణాల సమీకరణకు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నది. ఇదిలా ఉండగా హైడ్రా ద్వారా ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను మానిటైజ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ప్రాజెక్టులు.. అంతా కలిపి లక్ష కోట్లకు పైనే అవసరం

హైడ్రా భూములపై సర్కార్ నజర్.. వేలం ద్వారా నిధుల సమీకరణపై దృష్టి

హైదరాబాద్, ఆగ స్టు 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భా రాన్ని తగ్గించుకునేందుకు దాదాపు 3 వేల ఎకరాలకు పైగా విలువైన ప్రభుత్వ భూము లను దశలవారీగా ఈ  తీసుకురావాలనే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్, ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లోని అధిక విలువ కలిగిన భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్ర ఖజానాకు రూ. 90 వేల నుంచి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం సమకూరే అవకాశం లభిస్తుంది. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ భూముల మానిటైజే షన్ కార్యక్రమాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పరిపాలన అవసరాల్లో భాగంగా ప్రభుత్వం ఒకవైపు ఎస్బీఐ, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ వంటి దేశీయ ఆర్థిక సంస్థలతోపాటు అవసరమైన చోట ఆసియన్ డెవలప్‌మెం ట్ బ్యాంక్ (ఏడీబీ), వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణాల సమీకర ణపై ప్రభుత్వం కసర త్తు చేస్తున్నట్లు సమాచారం.

దీంతోపాటు హైడ్రా ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాం తాల్లో వేలాది ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన భూములు, పర్యావరణ పరిర క్షణకు సంబంధించిన చెరువులు, నాలాలు, గ్రీన్ బఫర్ జోన్లను పూర్తిగా మినహాయించి, ప్రభుత్వ యాజమాన్యం స్పష్టంగా ఉన్న, న్యాయపరమైన వివాదాలు లేని, వాణిజ్యపరంగా అభివద్ధి చేయడానికి అనువైన భూములను ప్రత్యేకంగా గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

వీటిలో కొంతభాగాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా మౌలిక సదుపాయాల కోసం వినియోగించే అవకాశాలను పరిశీలిస్తూనే, అత్యధిక మార్కెట్ విలువ ఉన్న భూములను దశలవారీగా ఈ--వేలం ద్వారా మానిటైజ్ చేయాలనే ప్రతిపాదనపై కూడా కసరత్తు జరుగుతున్నది. దాదాపు 3 వేల ఎకరాలకు పైగా భూముల వివరాలను సమీకరించి, వాటి మార్కెట్ విలువ, న్యాయపరమైన హోదా, మాస్టర్ ప్లాన్‌లో ఉన్న భూ వినియోగాన్ని పరిశీలించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికార వర్గాల సమాచారం.

హైదరాబాద్, గచ్చిబౌలి, కోకాపేట్, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్, ఖానాపూర్, నార్సింగి, పుప్పాలగూడ, ఓఆర్‌ఆర్ కారిడార్ పరిసర ప్రాంతాల్లోని భూములపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు, కమర్షియల్, హైఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కేంద్రాలుగా మారడంతో భూముల ధరలు గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల వేలంపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. 

గత ప్రభుత్వం తరహాలోనే..

ప్రభుత్వ భూములను మానిటైజ్ చేయడం తెలంగాణకు కొత్త అంశం కాదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను దశలవారీగా ఈ--వేలం వేసి భారీ ఆదాయం సమీకరించింది. ముఖ్యంగా 2021లో కోకాపేట్ నియోపోలిస్ భూముల ఈ-వేలం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆ వేలంలో రికార్డు స్థాయిలో బిడ్లు నమోదవడంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయ ల ఆదాయం లభించింది. అనంతరం రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, బుద్వేల్, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేలాలకు కూడా పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. గత వేలాల అనుభవాన్ని పరిశీలిస్తే, ఐటీ కారిడార్, ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలోని భూములకు మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఈక్రమంలోనే ఇప్పుడు హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన ప్రీమియం భూములను కూడా దశలవారీగా మార్కెట్లోకి తీసుకువస్తే ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉం దని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో సాధారణ ప్రభుత్వ భూములను వేలం వేయగా, ఇప్పుడు హైడ్రా ద్వారా ఆక్రమణల నుంచి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన భూముల వినియోగం కావడంతో ఈ ప్రక్రియ మరింత సున్నితమైన అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా ఆస్తులను రక్షించేందుకు, ఆక్రమణలను తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని చెబుతూనే చివరికి ఆ భూములను విక్రయించడానికే ఈ చర్యలా? అని ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రశ్నించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు, ప్రభుత్వం ఈ భూముల విక్రయం ద్వారా వచ్చే నిధులను మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రహదారులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకా ల అమలుకు వినియోగిస్తామని చెబితే, దానిని ప్రజలకు ఎలా వివరించాలన్నది కూడా కీలకంగా మారనుంది.

స్థానిక సంస్థల ఎన్నిక లు, హైదరాబాద్ నగర రాజకీయాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు వంటి అంశాలు ఈ చర్చకు మరింత రాజకీయ రంగు పులుమే అవకాశం ఉంది.అందువల్ల హైడ్రా భూముల వేలం కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా, పాలక మధ్య మరో కీలక రాజకీయ అజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అన్నింటికీ కలిపి లక్ష కోట్లకు పైనే..

మహిళా సంక్షేమ పథకాల అమలుకు (సన్నబియ్యం, మహిళా ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ తదితర కార్యక్రమాలు) ఏటా సుమారు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా. రైతు భరోసా, రుణమాఫీ మిగిలిన భారం, వ్యవసాయ అనుబంధ పథకాల కోసం రూ.18 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు అవసరం ఉండొచ్చని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రూ.22 వేల కోట్లకు పైగా వ్యయం అంచనా వేయగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ల పెండింగ్ బకాయిలు రూ.8 వేల కోట్లకు పైగా ఉన్నట్లు ఇప్పటికే పలు వర్గాలు పేర్కొంటున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తొలి దశకు రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతులు లభించగా, హైదరాబాద్ మెట్రో ఫేజ్--1 ప్రభుత్వ స్వాధీనం, ఫేజ్--2 విస్తరణకు కలిపి రూ.20 వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు పైగా నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది.

ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధాన రహదారులు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సుమారు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు, సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం పునరుద్ధరణ, ఇతర నీటిపారుదల పనులకు రూ.10 వేల కోట్లకు పైగా అవసరమవుతుందని అంచనా.

వీటితో పాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీ చెల్లింపులు, వివిధ శాఖల నిర్వహణ వ్యయాలకే ప్రతి సంవత్సరం రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చవుతున్నట్లు బడ్జెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ అవసరాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే, రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అప్పుల చెల్లింపులు, ఇతర ఆర్థిక బాధ్యతల కోసం ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు మించి నిధులను సమీకరించాల్సిన అవసరం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.