7 August, 2026 | 4:40 AM

సిద్దిపేట జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.5.49 కోట్లు

07-08-2026 01:29 AM

*అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం

*వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం

సిద్దిపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన గురువారం జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో రూ.5.49 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం లభించింది. సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పాల్గొన్నారు.

ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది వివరాలను సమగ్రంగా అందించడంలో విఫలమైన సూపరింటెండెంట్తో పాటు సంబంధిత అధికారులపై మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో చేరేలా వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు పంపాలని, ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన అదనపు నిధుల కోసం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్యాలియేటివ్ కేర్ సేవలపై ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఆర్బీఎస్కే ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కంటి, వినికిడి లోపాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని, జిల్లాలోని 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను మరింత విస్తరించాలని మంత్రి ఆదేశించారు. అనవసర సీ-సెక్షన్ ప్రసవాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రిఫర్ చేసే రోగులను ప్రభుత్వ అంబులెన్స్ ద్వారానే తరలించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ కీమోథెరపీ, ప్యాలియేటివ్ కేర్, పీడియాట్రిక్ కేర్, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, అంబులెన్స్, ఇన్పేషంట్ ఆహారం తదితర సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. సూపరింటెండెంట్, వైద్యులు క్రమం తప్పకుండా విధులకు హాజరై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందేలా ప్రతి అధికారి, వైద్యుడు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత షా, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ధనరాజ్తో పాటు వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.