7 August, 2026 | 3:32 AM

ఆంధ్రామయం!

07-08-2026 01:05 AM

పనులన్నీ ఏపీ కాంట్రాక్టర్లకే.. తెలంగాణలో సమర్థులైన కాంట్రాక్టర్లు లేరా?

  1. రాష్ట్ర సంపదలో 30 శాతం ఆస్థాన కాంట్రాక్టర్లే దోచుకుంటున్నారు 
  2. బీఆర్‌ఎస్ హయాంలోని అధికారులు, కాంట్రాక్టర్లనే కాంగ్రెస్ కొనసాగిస్తున్నది 
  3. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సుమారు రూ. 92 వేల కోట్ల విలువైన పనులు చేపడితే, అం దులో రూ. 82,500 కోట్ల వరకు పనులను ఏపీకి చెందిన కాంట్రాక్టర్లకే అప్పగిం చారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశర్‌రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి సన్నిహితమైన ఆంధ్రా కాంట్రాక్టర్లు పనుల విలువలో సుమారు 30 నుంచి 32 శాతం తమ వద్ద ఉంచుకొని, మిగిలిన పనులను తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులుగా ఇస్తున్నారని తెలిపారు.

తెలంగాణ సంపదలో 30 శాతం ఆస్థాన కాంట్రాక్టర్లే దోచుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప లు చెప్పుకుంటున్నారని, సుమారు 200 పాఠశాలలకు సంబంధించిన రూ. 5 వేల కోట్ల విలువైన పనులను ఒకే ఆంధ్రా కాం ట్రాక్టర్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సమ ర్థులైన కాంట్రాక్టర్లు లేరా?, వేల కోట్ల పను లు ఒకే వర్గానికి ఎందుకు కట్టబెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్- బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య అవినీతి బంధం కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మంత్రుల వరకు శాఖల వారీగా దోపిడీకి పాల్పడుతున్నారని, గత బీఆర్‌ఎస్ పాలనలో కీలక స్థానా ల్లో పనిచేసిన అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్‌గా నియమితులైన నరసింహారెడ్డి గతంలో కేటీఆర్‌తో సన్నిహితంగా తిరిగిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు.

హరీష్‌రావు వద్ద దాదాపు తొమ్మిదిన్నరేళ్లు పీఏగా పనిచేసిన అశోక్‌రెడ్డికి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు ఇవ్వడంలోని ఆంతర్యమేంటని నిలదీశారు. ప్రత్యక్ష నియామక ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ, కన్‌ఫర్డ్ ఐఏఎస్ అధికారులకే కీలక పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్ అవగాహనకు నిదర్శనమని ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.

మూసీ ప్రాజెక్టు పేరుతో తొలుత రూ. 10 వేల కోట్లను రెండు ప్యాకేజీలుగా, ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ. 5 వేల కోట్లు కేటాయించారని, ఇప్పుడు మరో రూ. 11 వేల కోట్ల టెండర్లు సిద్ధంచేశారని తెలిపారు. మూసీలో చెత్త తొలగింపు పేరుతోనే మొత్తం రూ. 21 వేల కోట్ల ప్రజాధానాన్ని ఖర్చు చేయబోతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలకు, ఉద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ టెండర్లకు మాత్రం వేల కోట్ల ఎక్కడినుంచి తెస్తోందని ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల సొమ్ముతో అమెరికా పర్యటనకు వెళ్లారని, ఆయన ఎవరి డబ్బులతో విదేశాలకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌కో సీఎండీర, సింగరేణి సీఎండీలకు ఆటా కార్యక్రమంతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్మును సర్దుబాటు చేసుకోవడానికే అధికారులు, మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారా అని నిలదీశారు. అధికారుల తర్వాత సీఎం అమెరికా వెళ్తారనే ప్రచారం జరుగుతోందని, ఈ పర్యటనల ఉద్దేశాన్ని ప్రభుత్వం వెల్లడించాలన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో లబ్ధిపొందిన కాంట్రాక్టర్లు, అధికారులు, మధ్యవర్తులే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారని చెప్పారు. టెండర్లు, కమీషన్లు, భూముల కేటాయింపులు, షెల్ కంపెనీలు, నియామకాలు, సబ్ కాంట్రాక్టులు, విదేశీ పర్యటనలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

అమెరికా పర్యటనకు సంబంధం ఉందా?

సింగరేణిలో 466 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాల వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. మంత్రి వివేక్ రూ. 20 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అదే ఏఎంఆర్ సంస్థకు కాంట్రాక్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో భట్టి విక్రమార్కతో ఉన్న అవగాహన ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే కొన్ని సంవత్సరాలుగా చెల్లించకుండా ఉంచిన వందల కోట్ల పన్నును ఒక్కసారిగా చెల్లించినట్టు వస్తున్న వార్తల విషయం భట్టి విక్రమార్కకు తెలుసా అని ప్రశ్నించారు. ఆ ఆర్థిక వ్యవహారాలకు అమెరికా పర్యటనకు ఏమైన సంబంధం ఉందా అనే అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. 

ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

రెవెన్యూ శాఖను దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా మార్చారని ఆరోపించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నాయని చెబుతున్న 103 షెల్ కంపెనీల వెనుక ఎవరు ఉన్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీలకు, ఫీనిక్స్ సంస్థ భూములు ఎలా వచ్చాయో చెప్పాలని, సుమారు రూ 15 వేల కోట్ల విలువైన భూములు కుటుంబ కంపెనీలకు చేరాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

22 జాబితాలో ప్రైవేట్ భూములను ఎందుకు చేర్చుతున్నారు, వాటిని ముందుగా బ్లాక్ చేసి తర్వాత ఎవరి ప్రయోజనాల కోసం అన్ బ్లాక్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలన్నింటినీ ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టులు, భూ వ్యవహారాల వివరాలను బయటపెడతామని, కళ్లు మూసుకుని పాలు తాగితే ఎవరూ చూడరనుకోవద్దని, బీజేపీ ప్రతి వ్యవహారాన్ని గమనిస్తోందని తెలిపారు.

కేటీఆర్, హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై, వేల కోట్ల టెండర్లపై వారు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలపై ఇప్పటికే సుమారు రూ. 21 వేల కోట్ల అదనపు భారాన్ని మోపి, ఇప్పుడు వేల కోట్ల టెండర్ల పేరుతో మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.