తెలంగాణ సోయి లేని సీఎం
- ఆయన వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు గండి
- రైతులకు కరెంటు ఇవ్వరు, ప్రాజెక్టులు నింపరు
- జయశంకర్ ఆశయాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం సిద్దిపేటలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడుతూ, ఆయన ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, రాష్ట్ర త్యాగాల విలువ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే నేడు తెలంగాణ ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఒక్క కొత్త ప్రాజెక్టుకు అనుమతి సాధించలేకపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.
సమ్మక్క సాగర్‌కు కేటాయించిన నీటిని ఎందుకు వదులుకుంటున్నారో సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నీటి హక్కులను రక్షించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. కాగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూ రల్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ రైతులు వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందడం లేదని ఫిర్యాదు చేయడంతో హరీష్‌రావు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌ను తనిఖీ చేశారు.
బుధవారం కేవలం 10 గంటల 30 నిమిషాలు మాత్రమే విద్యుత్ సరఫరా చేసినట్లు నమోదైందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్లను నింప క సాగునీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందనానరు. గత ప్రభుత్వ హయాంలో అమలైన 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, నెలల తరబడి కనెక్షన్లు మంజూరు చేయడం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలోనే వెయ్యి కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.






