ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..
అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల టౌన్ : జిల్లాలో సప్లమెంటరీ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఇంటర్ విద్య, రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఈనెల 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 10 పరీక్షా కేంద్రాల్లో 3447 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు 2434 సెకండ్ ఇయర్ 1013 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరిడెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు,డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి కఠినమైన నిఘా పెట్టాలని తెలిపారు.ప్రశ్నాపత్రాల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు పరీక్షల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉన్నందున జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లోకి ఎవరు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు,తగిన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను సూచించారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శంకర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, రెవెన్యూ శాఖ అధికారి మంజుల,ఆర్టీసీ అధికారి సునీత, విద్యుత్ శాఖ, విద్యా శాఖ సహాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు






