19 May, 2026 | 3:18 AM

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

19-05-2026 12:00 AM
  1. రూ.42.5 లక్షలు విలువైన సొత్తు రికవరీ 
  2. 145 గ్రాముల బంగారు, 5.7 కిలోల వెండి నగలు స్వాధీనం 
  3. తెలుగు రాష్ట్రాల్లో 32 చోరీ కేసుల్లో నిందితుడు
  4. భారీ చోరీ కేసు ఛేదించిన కామారెడ్డి పోలీసులు

కామారెడ్డి, మే 18 (విజయక్రాంతి): అంతర్ రాష్ట్ర దొంగను కామారెడ్డి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. పాత నేరస్తుడైన ఠాగూర్ జగన్ సింగ్ కరీంనగర్‌లో నివాసం ఉంటూ చోరీలకు పాల్ప డుతున్నట్టు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. గత నెల 11న కామారెడ్డి విద్యానగర్లోని అపార్టుమెంటులో జరిగిన చోరీపై బాధితుడు అడ్డగుల్ల బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఊరెళ్లి ఇంటికి వచ్చి చూడగా వస్తువులన్ని చిందరవందరగా ఉండి, అల్మా రాలో భద్రపరిచిన 333 గ్రాముల బంగారు ఆభరణాలు, 10.290 కిలోల వెండి వస్తువులు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి టౌన్ సీఐ నరహరి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామన్, సీసీఎస్ ఎస్‌ఐ, టౌన్ ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి  విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కామారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, గోవా, ముంబై, బెంగ ళూరు తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ, తా ళం వేసి ఉన్న ఇళ్లను ముందుగా రెక్కీ నిర్వహించి  అదనుచూసి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు హైదరాబాద్ నుండి ముంబైకి ప్రైవేట్ బస్సులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి టౌన్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా జాతీయ రహదారిపై సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నింది తుడు తన పేరు ఠాకూర్ జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్ అలియాస్ డీజే డానీ అలియాస్ దినేష్ రాజ్ పురోహిత్‌గా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 32 కేసుల్లో నిందితుడుగా ఠాకూర్ జగన్ సింగ్ ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. 145 గ్రాముల బంగారం, 5.7 కిలోల వెండి,  రూ. 42.50 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసినట్టు తెలిపారు.