27 July, 2026 | 2:22 AM

అధ్వానంగా రైతు వేదికలు!

27-07-2026 01:27 AM

అందరూ వినియోగిస్తారు..

ఆలనా పాలన పట్టించుకోరు..?

అధ్వాన్నంగా రైతు వేదిక 

కేసముద్రం, జులై 26 (విజయక్రాంతి): ప్రభుత్వపరంగా నిర్వహించే ప్రతి వేడుకకు శాఖలతో సంబంధం లేకుండా మండల పరిషత్ ఆవరణలోని రైతు వేదిక భవనాన్ని వినియోగిస్తారు. వ్యవసాయ శాఖతో సంబంధంలేని ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు శిక్షణా కార్య్ర కమాలు, అవగాహన సదస్సులు రైతు వేదికలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రైతు వేదిక నిర్వహణ బాధ్యతను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

కేవలం అన్నదాతలకు అవసరమైన కార్యక్రమాలకు, వ్యవసా య సంబంధమైన అంశాలకు మాత్రమే రైతు వేదికను వినియోగించాల్సి ఉండగా అందుకు భిన్నంగా మండల పరిషత్ ఆవరణలో రైతు వేదిక ఉండడంతో ప్రతి శాఖ నిర్వహించే కార్యక్రమానికి వేదికగా మార్చుకుంటున్నారు. అయితే రైతు వేదికను కనీసం శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దీనితో రైతు వేదిక ఆడిటోరియం పూర్తిగా బూజు పట్టి కళా విహీనంగా మారింది. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారింది.

దీనికి తోడు రైతు వేదికలో ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలో వినియోగానికి అనువుగా లేవు. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించే నాధుడే లేడు. రోజుకు కనీసం ఆవరణను శుభ్రపరిచే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారి ఇతర ఏఈవోలు కలిసి సొంత ఖర్చులతో కార్యాలయాన్ని ఆవరణను శుభ్రం చేయించుకో వాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్వహణకు ప్రభుత్వం ఎటువంటి ఖర్చులు పెట్టుకునేందుకు బడ్జెట్ కేటాయించకపోవడంతో గత కొద్ది సంవత్సరాలుగా రైతు వేదిక నిర్వహణను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారింది.

దాదాపు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా రైతు ‘వేదిక’ కావాల్సిందే. అయితే నిర్వహణ బాధ్యత మాత్రం మాది కాదంటే మాది కాదని.. పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు ఇతర చోట్ల నిర్వహిస్తే కాస్త కూర్చో ఖర్చు పెట్టాల్సిన అధికారులు ఆ మాత్రం నిధులు రైతు వేదిక నిర్వహణ కోసం కేటాయిస్తే రైతు వేదిక అధ్వానంగా మారే పరిస్థితి లేదంటున్నారు.

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు కనీసం వారానికోసారైనా రైతు వేదికను శుభ్రపరిచే బాధ్యత తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పనికిరాకుండా నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని, నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో రైతు వేదికను వినియోగానికి అనువుగా మార్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.