గచ్చిబౌలిలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
46.737 కిలోల గంజాయి స్వాధీనం
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
శేరిలింగంపల్లి, జూలై 28 (విజయక్రాంతి): ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.5 లక్షల విలువైన 46.737 కిలోల గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారంతో లింగంపల్లి రోడ్డులోని ఎస్బర్డ్ బస్స్టాప్ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేయగా, ఐదు ట్రావెల్ బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
బ్యాగులను తనిఖీ చేయగా 23 ప్యాకెట్లలో గంజాయి లభించింది. విచారణలో ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి పూణే, సోలాపూర్ ప్రాంతాల్లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ కేసును ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ను ఇన్స్పెక్టర్లు పి. నరేష్, కె. సైదులు ఆధ్వర్యంలో నిర్వహించగా, పోలీసు బృందాన్ని సైబరాబాద్ సీపీ అభినందించారు.






