9 June, 2026 | 5:57 PM

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

09-06-2026 04:46 PM

- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 

- ఆకస్మిక తనిఖీ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోనీ రాంనగర్ ప్రాంతంలో చేపట్టిన పట్టణ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో భాగంగా బెల్లంపల్లిలో చేపట్టిన పాఠశాల పనులను పరిశీలించారు. కన్నేపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు.

వర్షాకాలం సమీపిస్తున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న భోజనశాల, ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.