5 August, 2026 | 2:42 AM

గట్టు జెడ్పీహెచ్‌ఎస్‌లో అమ్మ ఆదర్శ కమిటీ తనిఖీ

05-08-2026 01:43 AM

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

గట్టు, ఆగస్టు 4 (విజయక్రాంతి) : గట్టు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు మంగళవారం సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, డ్రాపౌట్ వివరాలు, ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా గదుల కొరత కారణంగా కంప్యూటర్లను ఏర్పాటు చేయలేకపోవడం, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు నేలపైనే భోజనం చేయాల్సి రావడం, పాఠశాల ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు వాష్రూమ్లలోని సామగ్రిని ధ్వంసం చేస్తున్న విషయాలపై కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, కొత్త తాగునీటి ట్యాంక్ నిర్మాణం, పాఠశాల ఆవరణలో మొరం వేయించడం, భవనాలకు సున్నం వేయించడం వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధానోపాధ్యాయుడు నల్లారెడ్డితో చర్చించారు. సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు మునేశ్వరి, శారద, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.