29 July, 2026 | 3:07 AM

రోస్టర్ విధానంతో మాల సామాజిక వర్గానికి అన్యాయం

29-07-2026 12:28 AM

ఆగస్టు 10, 11న ’హలో మాలచలో ఢిల్లీ’ని విజయవంతం చేయాలి 

రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పిలుపు

ముషీరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆరోపించింది. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవాధ్యక్షుడు చెరుకు రాంచందర్, వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహయ్య, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందని, 14 ఉద్యోగ నోటిఫికేషన్లతో మాల యువత నష్టపోయారని ఆరోపించారు.

మాల ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేకుంటే వారి ఇళ్ల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని నిపుణుల సూచనలతో సవరించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ’హలో మాలచలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా మాల సంఘాలు, విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సఖి గంగాధర్, తుమ్మ శ్రీనివాస్, సీపూరి ప్రణయ్, మాదాసు రాహుల్, పండుగ భానుతేజ, బత్తుల రమేష్, బత్తుల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.