3 April, 2026 | 5:15 AM

నూతన రైల్వేలైన్ మంజూరీలో కొల్లాపూర్‌కు అన్యాయం

03-04-2026 12:32 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండి ఫయాజ్

కొల్లాపూర్‌టౌన్, ఏప్రిల్ 2: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న జడ్చర్ల టూ కొల్లాపూర్ రైల్వే లైను విషయంలో మరో మారు ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండి ఫయాజ్ ఆరోపించారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

1970 లోనే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కమ్యూనిస్టు అగ్ర నాయకులు కామ్రేడ్ కటికనేని గోపాలరావు  వారి సొంత పైసలతో జడ్చర్ల నంద్యాల రైల్వే ఇప్పుడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సర్వేలు నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కొల్లాపూర్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రతిసారి ఏదో ఒక నాయకుడు వచ్చి కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ తీసుకొస్తామని కబుర్లు చెబుతున్నారు.

ఎన్నికల తర్వాత వారి జాడే కనపడదని విమర్శించారు. ఒక కొత్త రైల్వే లైన్ వస్తే అందులో మొదటి ప్రాధాన్యత జడ్చర్ల నుండి కొల్లాపూర్ మీదుగా వెళ్లే నంద్యాల రైల్వే కావాలని అలా కాకుండా గద్వాల్ టు డోర్నకల్ రైల్వే లైన్ తీసుకురావడం కొల్లాపూర్ కి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలకు మోసం చేస్తుంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, మంత్రి జూపల్లి కృష్ణారావు.  పార్లమెంటు సభ్యులు మల్లు రవి. ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

తక్షణమే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా జడ్చర్ల నంద్యాల రైల్వే ని తీసుకురావాలని లేనిపక్షంలో ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. అలా లేని పక్షంలో ఈ ప్రాంత ప్రజల పక్షాన సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఇందిర, మండల కార్యదర్శి తుమ్మల శివుడు. కోడేరు మండల కార్యదర్శి తప్పేట కిరణ్ కుమార్. కొల్లాపూర్ పట్టణ కార్యదర్శి ఎం డి యూసుఫ్ సహాయ కార్యదర్శి రమణ నాయకులు చేపల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.