అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
సిపిఎం కార్యదర్శి షేక్ యాకూబ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్ళను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్ డిమాండ్ చేశారు.మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వ్యవసాయ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 25000 అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు.
వెంటనే వ్యవసాయ కార్మికులందరికీ సంవత్సరానికి 12000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఒక ఆర్టీసీ బస్సు, కరెంటు బిల్లు ఫ్రీ మినహా ఏమీ అమలు చేయడం లేదని అన్నారు. 60 సంవత్సరాలు నిండిన వారందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పంచాయతీ కార్యదర్శి పెండెం నాగమణి కి వినతిపత్రం అందజేశారు.






