చర్ల మండలంలో ఇందిరమ్మ చివరిదశ బిల్లులు పెండింగ్
అప్పుల ఊబిలో లబ్ధిదారులు, ఆగిన ఇళ్ల పనులు
చర్ల, జూన్ 14, (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఆశలపై అధికారుల నిర్లక్ష్యం నీళ్లు చల్లుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వందల ఇళ్లు చివరి దశకు చేరినా బిల్లులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. మండలంలో 1260 ఇళ్లు మంజూరు కాగా, 972 ఇళ్లు బేస్మెంట్, 535 ఇళ్లు రూఫ్ లెవల్, 200 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయి. కేవలం 76 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. తొలి, రెండో విడత నిధులు ఖర్చు చేసి, సొంత డబ్బు, వడ్డీకి తెచ్చిన అప్పులతో ఇళ్లను పూర్తి చేసిన వారు నెలల తరబడి చివరి బిల్లు కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న వైనం నెలకొంది. బిల్లుల జాప్యంతో అప్పులకు వడ్డీ పెరుగుతోంది.
పైకప్పు, ఫ్లోరింగ్, తలుపుల పనులు నిలిచిపోయాయి. వర్షా కాలం దగ్గరపడుతున్నా తలదాచుకునే పరి స్థితి లేక లబ్ధిదారులు ఆవేదన చెందుతు న్నారు. ‘ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయాం. ఫైలు ప్రాసెస్లో ఉందనే తప్ప మరో మాట లేదు‘ అని లబ్ధిదారులు వాపోయారు. పేదలందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది విరుద్ధమని స్థాని కులు మండిపడుతున్నారు. ఎన్నికల హామీలు గాలికి వదిలేసి అధికారులు అల సత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయా లని, జాప్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారిని డిమాండ్ చేస్తున్నారు.






