04-02-2026 01:29:59 AM
నేడు భారత్, సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్
తుది జట్టు కూర్పుకు చివరి ఛాన్స్
సంజూ ఫామ్ అందుకుంటాడా ?
బౌలర్ల సత్తాకు పరీక్ష
టీ ట్వంటీ వరల్‌డ కప్ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ అసలు టోర్నీకి ముందు చివరి సన్నాహకంగా వార్మప్ మ్యాచ్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. సఫారీ జట్టుతో తలపడనున్న టీమిండియా తుది జట్టు కూర్పును చివరిసారి పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్‌తోనైనా ఓపెనర్ సంజూ శాంసన్ ఫామ్ అందుకుంటాడా ? బౌలర్లు పూర్తిగా గాడిన పడతారా ?
ముంబై, ఫిబ్రవరి 3: టీ20 వరల్డ్‌కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ మొదలవనుంది. మెగా టోర్నీకి డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత జట్టు ముంబై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే మెగా టోర్నీ కి ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 6న నమీబియాతో ఆడ నుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా ఆటగాళ్ల ఫామ్, కాంబినేషన్లను టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షిం చనుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడగా, భారత్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.
ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యర్థితో వార్మప్ మ్యాచ్ జరుగుతుండటంతో ప్రాక్టీస్ మ్యాచ్ అయినా భారీ అంచనాలు నెలకొన్నాయి. రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఓ బలమైన శక్తిగా ఎదిగింది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను 4 కైవసం చేసుకున్న భారత్.. అదే ఊపును ఈ మెగా టోర్నీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబేవంటి యువ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా తుది జట్టులో ఉన్న చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ముఖ్యంగా సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కివీస్‌తో సిరీస్ ఆద్యంతం సంజూ ఫ్లాప్ అయ్యాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలను సంజూ అందిపు చ్చుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తారన్న అభిప్రాయం మొదలయ్యింది. దీంతో చివరి సన్నాహకంగా ఈ వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకుని ఫామ్‌లోకి వస్తాడేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా ఫెయిలైతే మాత్రం ప్రధాన మ్యాచ్‌లలో సంజూకు ప్లేస్ కష్టమే. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కి చోటు దక్కుతుంది.
దాదాపు ఏడాది తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ ఇటీవల కివీస్‌పై దుమ్ము రేపాడు. ఇప్పుడు తిలక్‌వర్మ గాయం నుంచి కోలుకోవడంతో రీ ఎంట్రీ ఖాయం అయింది. దీంతో సంజూ, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని పక్కన పెట్టాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో సంజూ తన ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అటు సూర్య కుమార్‌యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా ఫామ్‌లోకి వచ్చారు. అయితే బౌలింగ్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందు లు ఉన్నాయి. బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ భారీగా పరుగు లు ఇచేస్తున్నారు. అసలు టోర్నీకి ముందు దీనిని అధిగమిస్తే భారత్‌కు తిరుగుండదు.
కాగా భారత ప్రధాన జట్టుతో పాటు, ఇండియా- ఏ జట్టు కూడా ఈ ప్రాక్టీస్ సెషన్లలో భాగం కానుంది. దేశవాళీ, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ జట్లతో తలపడే అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లు యువ ఆటగాళ్లకు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదికగా నిలవనున్నాయి. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంది. తమ కాంభినేషన్‌పై చివరి ప్రయో గాలకు సిద్ధమయింది. ఇరు జట్లు వార్మప్ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో హోరాహోరిగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.