మునుగోడులో 6 గ్యారెంటీల అమలు విఫలం
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి
మునుగోడు,ఏప్రిల్ 6 : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం డిమాండ్ చేశారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని, అవసరమైతే స్వంత నిధులతోనే పనులు చేపడతానని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.
రైతుల సమస్యలపై ప్రశ్నిస్తున్న బిఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ, తొక్కిపట్టి నాశనం చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. మునుగోడు అభివృద్ధి చేయలేకపోయిన రాజగోపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాల ని, ఉదయ సముద్రం, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా నీరు అందించడంలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, మండల నాయకులు మదనబోయిన పరమేష్ యాదవ్, నన్నూరి భూపతి రెడ్డి, పొలగొని సైదులు గౌడ్ పాల్గొన్నారు.




