28 July, 2026 | 1:22 AM

100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి

28-07-2026 12:25 AM

ఆర్డీఓకు బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ వినతి.

బోధన్, జూలై 27 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని రాష్ట్ర సంరక్షణలో ఉన్న చారిత్రాత్మక 100 స్తంభాల (ఇంద్ర నారాయణ స్వామి) ఆలయ రక్షణ కోసం తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారులు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)కు వినతిపత్రం సమర్పించారు.

ఈ వినతిపత్రంపై రాష్ట్ర కమిటీ కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, రాష్ట్ర కమిటీ సంయుక్త కన్వీనర్ గున్నాల నవీన్ కుమార్ సంతకాలు చేశారు. ఈ వినతిపత్రం ప్రతులను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, బోధన్ ఏసీపీ, సీఐ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, తెలంగాణ పురావస్తు మరియు సంగ్రహాలయాల శాఖ డైరెక్టర్ తదితర అధికారులకు పంపించారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు బోధన్ పట్టణంలో దర్గా సమీపంలో వార్షిక కార్యక్రమం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం ఉందని తెలిపారు.

ఈ సభా ప్రాంగణానికి ఆనుకుని తెలంగాణ ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సంరక్షిత స్మారక చిహ్నంగా ఉన్న 100 స్తంభాల (ఇంద్ర నారాయణ స్వామి) ఆలయం ఉండటంతో, ఆలయ ప్రాంగణంలోకి అనధికార ప్రవేశం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారసత్వ కట్టడానికి నష్టం వాటిల్లే ప్రమాదంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల కార్యక్రమం జరిగే రోజులలో ఆలయ ప్రాంగణం చుట్టూ తాత్కాలిక కంచె లేదా బారికేడ్లు ఏర్పాటు చేయడం, తగిన పోలీసు బందోబస్తు కల్పించడం, రక్షిత ప్రాంగణాన్ని బహిరంగ సభలు, కూర్చునే ఏర్పాట్లు లేదా ఇతర కార్యకలాపాలకు వినియోగించకుండా చూడాలని అధికారులను కోరారు.

అలాగే పురావస్తు శాఖ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్ర సంరక్షిత వారసత్వ కట్టడాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా శాంతిభద్రతలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఈ విజ్ఞప్తి ఏ సమాజం, మతం లేదా చట్టబద్ధమైన ప్రజా కార్యక్రమానికి వ్యతిరేకంగా కాదని, రాష్ట్ర సంరక్షిత వారసత్వ కట్టడం రక్షణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నతిపత్రంపై 24 గంటల్లో అధికారిక లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర సంరక్షిత వారసత్వ కట్టడం పరిరక్షణ కోసం చట్టపరమైన, పరిపాలనాపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ హెచ్చరించింది.