4 April, 2026 | 11:07 AM

ఏటీసీకి ఇచ్చిన మట్టి అక్రమార్కుల పాలు

04-04-2026 09:35 AM

ట్రాక్టర్ కి రూ. 2500 చొప్పున విక్రయం...

అధికారుల అండదండలతో అమ్ముకుంటున్న కాంట్రాక్టర్...!

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల అవసరాల నిమిత్తం సింగరేణి ఓపెన్ కాస్ట్ నుంచి ఓవర్ బర్డెన్ (ఓబీ) మట్టిని సింగరేణి అధికారులు కేటాయిస్తుంటారు. సంబంధిత అధికారులు అడిగిన మేరకు ఎంత అవసరమో అంత సింగరేణి సిబ్బంది పర్యవేక్షణలో పంపిస్తుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఐటిఐ ఏ టీ సీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)కి రోడ్డు నిమిత్తం మట్టి అవసరం ఉండడంతో సంబంధిత శాఖ అధికారుల విన్నపం మేరకు సింగరేణి అధికారులు పంపించిన మట్టి అక్రమార్కులకు వరంలా మారింది. అవసరం కన్నా ఎక్కువ తెప్పించుకొని అక్రమార్కులు అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నారు.

ట్రాక్టర్ కి రూ. 2500 చొప్పున విక్రయం...

శ్రీరాంపూర్ ఏ టి సి కి రోడ్డు కోసం మొదట కొన్ని ట్రిప్పులు సింగరేణి నుంచి తెప్పించిన కాంట్రాక్టర్, సరిపోవడం లేదంటూ మరో 90 ట్రిప్పుల మట్టిని అధికారుల సహాయంతో తెప్పించుకున్నాడు. రోడ్డు పనులు పూర్తవడంతో అదనంగా తెప్పించుకున్న మట్టిని ఇదే అదనుగా అమ్మకం ప్రారంభించాడు. జెసిబి లతో ట్రాక్టర్లను మట్టిని లోడింగ్ చేయించి ఒక్కో ట్రిప్పునకు రూ. 2500 నుంచి రూ. 3 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిని నిరోధించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ కు వత్తాసు పలకడంతో పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని విక్రయించే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ సుజాత ను వివరణ కోరగా నా దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.