4 April, 2026 | 11:06 AM

ఇంకా తెరచుకోని రేషన్ దుకాణాలు

04-04-2026 09:32 AM

మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం వేసవిని దృష్టిలో ఉంచుకొని మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలల రేషన్ బియ్యాన్ని లబ్దిదారులకు ఒకే సారి ఏప్రిల్ నెలలోనే గతంలో మాదిరిగా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ రేషన్ పంపిణీని సైతం నాయకులు, అధికారులు ఒకటవ తేదీననే అధికారికంగా ప్రారంభించారు. జిల్లాలోని 18 మండలాల్లో గల 423 రేషన్ దుకాణాలకు సంబంధిత శాఖ అధికారులు సైతం విడతల వారిగా మూడు నెలల రేషన్ ను పంపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న కొన్ని చోట్ల అసలు రేషన్ దుకాణాలను తెరవడమే లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

జిల్లాలో 2,55,261 (2,39,559 ఆహార భద్రత (ఎఫ్ఎస్సీ), 15,543 ఏఎఫ్ఎస్సీ, 159 అన్నపూర్ణ) కార్డుల పరిధిలో 7,56,434 (ఎఫ్ఎస్సీ 7,10,224, అంత్యోదయ 46,045, అన్నపూర్ణ 165) యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్ కి ఆరు కిలోల చొప్పున నెలకు 4,806 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ నెలలోనే ఒకే సారి మూడు నెలలకు సంబంధించి సుమారు 14,400 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కొందరు డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అసలు దుకాణాలనే తెరవకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారుతుంది. 

ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరఫరా కావడం లేదా..?

ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి జిల్లాలోని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణీ జరగాలి. కొన్ని రేషన్ దుకాణాలు ఇప్పటికి తెరవకపోవడానికి కారణం అసలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం వెళ్లకపోవడమే కారణమా..? లేదా బియ్యం వచ్చిన లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించేందుకు రేషన్ డీలర్ పన్నాగమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం కోటా వచ్చినా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంలో అంతర్యమేమిటో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.