పాకాల వైల్డ్ లైఫ్ లో పీసీసీఎఫ్ పర్యటన
మహబూబాబాద్, (విజయక్రాంతి): తెలంగాణలో అడవుల సంరక్షణ, పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో, అటవీశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్ వినయ్ కుమార్, పాఖాల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం పర్యటించారు. సి సి ఎఫ్ భీమా నాయక్, డిఎఫ్ఓ విశాల్ బత్తుల, అనూజ్ అగర్వాల్ లతో కలిసి వరంగల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని పాఖాల్ బయోడైవర్సిటీ ప్రాంతం, భీమునిపాదం జలపాతం వద్ద జరుగుతున్న ఎకో టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించారు.
అభివృద్ధి, పర్యాటకుల వసతి సౌకర్యాల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వన్యప్రాణుల ఆవాసాల రక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన ఆయన, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గూడూరు వైల్డ్ లైఫ్ డివిజన్ పరిధిలోని పులిమడుగు, మడగూడ బేస్ క్యాంపులను సందర్శించిన పీసీసీఎఫ్, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ, అడవుల సంరక్షణలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు..ఈ పర్యటనతో అడవుల సంరక్షణకు మరింత బలం చేకూరడంతో పాటు, పాఖాల్ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి మరింత దోహదపడనుందని అభిప్రాయపడుతున్నారు.




