నాసిక్‌లో ఘోరప్రమాదం — కారు బావిలో పడి తొమ్మిది మంది జలసమాధి
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో(Nashik District) ఒక కారు బావిలో పడిపోవడంతో ఆరుగురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. దిండోరి పట్టణంలోని శివాజీ నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక అధికారి పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలోని ఒక విందు కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కారు అదుపుతప్పి బావిలో పడిపోయిందని తెలిపారు. స్థానిక పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, అర్ధరాత్రి సమయంలో రెండు క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో కారును, అందులో ఉన్నవారిని వెలికితీశారు. దిండోరి తాలూకాలోని ఇండోర్ గ్రామానికి చెందిన దర్గుడే కుటుంబ సభ్యులే ఈ బాధితులని పేర్కొన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతులను సునీల్ దత్తు దర్గుడే (32), ఆయన భార్య రేష్మ, ఆశా అనిల్ దర్గుడే (32) ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలుగా గుర్తించారు. వీరిలో ఏడు నుండి 14 ఏళ్ల వయస్సు గల ఐదుగురు బాలికలు, 11 ఏళ్ల బాలుడు ఉన్నారు. వారి మృతదేహాలను దిండోరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఒక అధికారి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




