13 August, 2026 | 3:04 AM

ఇసుక అక్రమ డంపులను వెంటనే సీజ్ చేయాలి

13-08-2026 01:59 AM

సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఆగస్టు 12: ప్రభుత్వ అనుమతి కాలం అయిపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి అర్ధరాత్రిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని,అక్రమ ఇసుక డంపులను వెంటనే సీజ్ చేయాలని సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య డిమాండ్ చేశారు.

బుధవారం మూసీ పరివాహక ప్రాంతమైన జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఆపార్టీ ఆధ్వర్యంలో అక్రమంగా డంపు చేసిన ఇసుకను పరిశీలించి,తక్షణమే డంపును సీజ్ చేయాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ అశ్వినికి అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి,పూడిక పేరుతో ఇసుకను డంపులుగా చేసుకొని రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం శోషనీయమన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, టీజీఎండీసీ, మైనింగ్ అధికారులు స్పందించి డంపు చేసిన ఇసుకను సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్,జిల్లా నాయకులు పోలెబోయిన కిరణ్,దేశోజు మధు,నాయకులు పోలెబోయిన పెదలింగయ్య,మధుకర్,వడకాల బయన్న,ధర్మాజీ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.