సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సైతం సిద్ధం
గుర్తింపు సంఘం ఎఐటియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్
కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు, సంబంధించి పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని గుర్తింపు సంఘం ఎఐటియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ లు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం శేషగిరిభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.
కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో మెడికల్ వ్యాలిడెషన్ కోసం ఎదురు చూస్తున్న కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారని, పెండింగ్ లో ఉంచిన మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెల్లించకుండా కావాలని సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లి సింగరేణి సంస్థను సర్వనాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత పది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం కలిసి , కొత్త గనులను ప్రారంభించకుండా సంస్థలో కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారని మెడికల్ బోర్డు నిలిపివేశారని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అదేవిధంగా క్రమం తప్పకుండా స్ట్రక్చర్ కమిటీను నిర్వహించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కే. వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, వై.వి రావు, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, సందబోయిన శ్రీనివాస్, గోపి, హుమాయూన్, నితిన్, గంగారం, మండల రాజేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సోమయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






