జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా
త్రైమాసికంలో 126 శాతం ప్రోగ్రెసివ్ ఉత్పత్తి
ఏరియా జీఎం దుర్గం రామచందర్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఏరియాలో సింగరేణి సంస్థ జూన్ నెలలో బొగ్గు ఉత్పత్తిలో 171 శాతం లక్ష్య సాధన చేసి విశేష ప్రతిభ కనబరిచిందని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. జూన్ నెలలో 6,48,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 11,07,882 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 171 శాతం సాధించామని తెలిపారు.
అలాగే 2026 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 25,62,500 టన్నుల ప్రోగ్రెసివ్ లక్ష్యానికి గాను 32,40,075 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 126 శాతం లక్ష్యాన్ని అధిగమించినట్లు పేర్కొన్నారు. బొగ్గు రవాణాలోనూ ఏరియా మెరుగైన పనితీరు కనబరిచిందన్నారు. జూన్ నెలలో 11,44,812 టన్నుల బొగ్గు రవాణా చేయగా, ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు మొత్తం 33,03,797 టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు పేర్కొన్నారు.
ఓవర్‌బర్డెన్ తొలగింపు పనుల విషయానికి వస్తే, జూన్ నెలలో 11 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 8,84,000 క్యూబిక్ మీటర్లు తొలగించి 80 శాతం సాధించామని చెప్పారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 35 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 27,58,000 క్యూబిక్ మీటర్లు తొలగించి 79 శాతం పురోగతి నమోదైనట్లు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగు లు, అధికారులు, కార్మికుల సమష్టి కృషి వల్లే లక్ష్యాలను అధిగమించగలిగామని జీఎం దుర్గం రామచందర్ అభినందిం చారు.
రానున్న నెలల్లో కూడా ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌ఓ టు జీఎం డి. వెంకట రామారావు, ఏజీఎం (ఐఈడీ) సీహెచ్. రాంబాబు, ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేశ్, ఏజీఎం (ఓపెన్‌కాస్ట్) ఈ. శ్రీనివాస్, డీజీఎం (సర్వే) ఎల్. దయాకర్, డిప్యూటీ సీఎంఓ డా. జ్యోతిర్మయి, సీనియర్ ఎస్టేట్స్ అధికారి కె. స్వప్న, పర్యావరణ అధికారి జె. శ్రీనివాస్ రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి కె. శ్రీనివాస్, ఫైనాన్స్ మేనేజర్ పి. రమేశ్, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ బి. శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) రాంచరణ్‌తో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.






