8 August, 2026 | 3:08 AM

శిక్ష విధిస్తే జీవితకాలం జైల్లోనే!

08-08-2026 01:28 AM

ఐఏఎస్ సుల్తానియాపై జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు

  1. కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణకు హాజరైన అధికారి
  2. అధికారులను కోర్టుకు పిలిపించడం మాకూ బాధాకరమే..
  3. రైతు బంధు పథకంతో కోటీశ్వరులూ లబ్ధిపొందుతున్నారు
  4. ఉచితాలతో పల్లెటూళ్లలో కూలీలూ దొరకడంలేదు
  5. ఇలా ఇస్తూపోతే కుబేరుడు కూడా కూలీకి వెళ్లాల్సిందే 
  6. జస్టిస్ నగేష్ భీమపాక

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): కోర్టు ధిక్కరణ పిటిషన్ విచా రణకు హాజరైన ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశా రు. ఆయనపై ఉన్న పిటిషన్లలో శిక్ష విధిస్తే జీవితకాలం ఆయన జైల్లోనే ఉం డాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తప్పుల వల్ల ఉన్నతాధికారులు పిటిషన్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నా రు.

జూలై 10న ఆయన కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. సందీప్ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. ఒకవేళ ఆయనే హాజరవుతానని హామీ ఇస్తే రూ.5వేల వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని హైదరాబాద్ సీపీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుల్తానియా శుక్రవారం హైకోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు.

కేసు విచారణ సందర్భంగా దీనిపై స్పందించిన జస్టిస్ నగేష్ భీమపాక .. ‘అధికారులను హైకోర్టుకు పిలిపించడం మాకూ బాధగానే ఉంది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి. ఆయనపై ఉన్న ఆ పిటిషన్లలో శిక్ష విధిస్తే జీవితకాలం ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వ తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.

రైతు బంధు పథకం ఎంతో మంచి పథకమే అయినప్పటికీ అందులో కోటీశ్వరులు కూడా లబ్ధిపొందుతున్నారు. ఎంతో మంది అనర్హులు ఉచిత పథకాలు పొందుతున్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి’ అని ఆయన పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తం విడతల వారీగా చెల్లిస్తామని కోర్టుకు సందీప్ కుమార్ తెలిపారు. తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా పడింది.

కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ సర్ ఛార్జి బకాయిలు దాదాపు రూ.33 కోట్లు చెల్లించకపోవడంతో సందీప్ కుమార్‌పై కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టీస్ నగేష్ భీమపాక ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు 

సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా అంటూ ఉచిత పథకాలు, ప్రభుత్వ పాలనా తీరుపై అంటూ జస్టీస్ నగేష్ భీమపాక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పెరిగిపోతున్న ప్రమాదకర పరిస్థితులను హెచ్చరించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉచిత పథకాలను కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.

ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామని ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి, ఈ దేశం మనకేమిచ్చింది లేదా నాకేమిచ్చారనే ధోరణి పెరిగిపోయిందన్నారు. ఉచిత పథకాల కారణంగా పల్లెటూళ్లలో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడిందని, రైతుల స్థితి ఘోరంగా తయారైందని తెలిపారు.

ఉచితంగా లభిస్తుండటంతో నేనెందుకు పనిచేయాలనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు స్వయంగా పనిచేసేవారట అని చెప్పుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రభుత్వాలు ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడి వద్ద ఉన్న ధనం కూడా సరిపోదని పేర్కొన్నారు.

కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలా?

కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజుల చెల్లింపులోనూ అర్హులైన, బాగా చదువుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కాలేజీలకు వెళ్లకుండా తిరిగే విద్యార్థులు యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఉన్నతాధికారులు బలి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నందుకే సందీప్ కుమార్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, వందకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లెక్కన చూస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని, మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏం చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఆయన ప్రశ్నించారు.

సందీప్ కుమార్ మంచి అధికారే అయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు పిలిపిస్తున్నామని తెలిపారు. ఒక పౌరుడిగా ఆవేదనతో.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే పాత వాస్తవాలను తెలియజేసేందుకే చెబుతున్నామని స్పష్టం చేశారు.