8 August, 2026 | 2:42 AM

నేతన్నలకు మొండిచెయ్యి

08-08-2026 01:21 AM
  1. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు కాలేదు
  2. చేనేత విషయంలో బీజేపీ-కాంగ్రెస్ వైఖరి ఒక్కటే
  3. సీఎంకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని నేతన్నల కడుపు కొడుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ ర్శించారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అమలైన ‘నేతన్న బీమా’, ‘నేతన్నకు చేయూత’ వంటి అనేక నేతన్నల కోసం ప్రత్యేకంగా అమలుచేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి నేతన్నలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమ లు కాలేదని ఆరోపించిన కేటీఆర్, వెం టనే అన్ని పథకాలను పునరుద్ధరించి నేతన్నలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఉత్సవాలు నిర్వహించుకునే రోజు కాదని, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత రంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ ‘నేతన్న బీమా’ అమలు చేశామని తెలిపారు.

ఒక్కో కార్మికుడికి ప్రీమియం ప్రభుత్వమే భరించిందని వివరించారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20 శాతం మార్కెటింగ్ రిబేట్ అందించడంతో పాటు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించామన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ది ఒకటే వైఖరి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేసిందని కేటీఆర్ ఆరోపించారు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల వంటి ప్రభుత్వ ఆర్డర్లలో నేతన్నలకు గతంలో  ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ ఆర్డర్లు అన్ని కమిషన్ల కోసం ప్రవేట్ సంస్థలకు వ్యక్తులకు అప్పజెప్తున్నారని విమర్శించారు.

అడ్డగోలుగా హామీలు ఇచ్చి అందరిని మోసం చేసినట్లుగానే నేతన్నలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.

ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ వంటి పథకాలను ఎత్తివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. పార్టీలు వేరైనా చేనేత విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిలో ఎలాంటి తేడాలేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని నేతన్నల తరఫున ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన చేనేత భరోసా, రుణమాఫీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఎక్స్‌లో పోస్టుచేశారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమటచుక్కలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్‌ఎస్ కృషిచేస్తుందన్నారు.