8 August, 2026 | 3:09 AM

నకిలీ వైద్యుల దందా

08-08-2026 01:32 AM

తెలంగాణలో విచ్చలవిడిగా.. ఆస్పత్రుల నుంచి ఐసీయూల దాకా!

  1. టీజీఎంసీ నంబర్లతో మోసాలు 
  2. జోగిపేట ఘటనతో వెలుగులోకి సివిల్ సర్జన్ సస్పెన్షన్ 
  3. ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ అర్హత లేని వైద్యం
  4. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు 
  5.    500కు పైగా కేసులు, 300 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

* తెలంగాణలో నకిలీ వైద్యుల  దందా పతాకస్థాయికి చేరింది. కనీస విద్యార్హతలు, లైసెన్సులు లేని వ్యక్తులు తెల్లకోటు తొడిగి, స్టెతస్కోప్ తగిలించి ప్రజారోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని నగరాల్లోని హైటెక్ లేజర్ సెంటర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల క్రిటికల్ కేర్ విభాగాలు, ఆఖరికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల వరకు నకిలీ నెట్‌వర్క్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆస్పత్రి ఘటనే అందుకు ప్రత్యక్ష నిదర్శనం.

ఏ చంద్రశేఖర్‌రావు :

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): జోగిపేట ఏరియా ఆస్పత్రి లో డిప్యూటీ సివిల్ సర్జన్.. తన స్థానం లో ఓ ప్రైవేట్ వ్యక్తితో నైట్ డ్యూటీ చేయించడం ఈ దందా ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టమవుతోంది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజన ర్సింహ.. సదరు ప్రభుత్వ వైద్యుడిని సస్పెండ్ చేయగా, నకిలీ డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించారు.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ)  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నా యి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేట, శివనగర్, కరిమాబాద్ ప్రాంతా ల్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై దాడులు చేసిన అధికారులు.. 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. కొందరు నకిలీలు ఇతర ఒరిజినల్ డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్లను అక్రమంగా వాడుతుండటం ఇక్కడ గమనార్హం.

హైదరాబాద్‌లోని సైదాబాద్, సింగరేణి కాలనీ పరిసరాల్లోని శ్రీనివాస క్లినిక్, హనుమంత్‌నాయక్ క్లినిక్ వంటి చోట్ల ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తులు సైతం అల్లోపతి ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కనీస ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేని వ్యక్తి, నకిలీ పత్రాలతో ఏకంగా ‘క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్’ గా ఏడాది కాలంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు..

తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందా లు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో నకిలీ వైద్యులపై  500 పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అందులో 300 మందికి పైగా నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన అర్హత పత్రాలు లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్న  80కి పైగా చిన్న ఆసుపత్రులు, వందలాది క్లినిక్‌లు, ప్రథమ చికిత్స కేంద్రా లను  సీజ్ చేశాయి.

నకిలీ వైద్యుల్లో దాదాపు 75 శాతం మంది హైదరాబాద్ నగర పరిధిలోని  ఎల్బీనగర్, సైదాబాద్, జీడిమెట్ల, మియాపూర్, పాతబస్తీ మురికివాడల్లో పట్టుబడ్డారు. వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాల పరిధిలో 25 కేంద్రాల్లో నకిలీలు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. 

ప్రాణాంతకంగా చికిత్సలు

అక్రమంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లలో రో గులకు అందిస్తున్న వైద్యం ప్రాణాంతకంగా మారుతోంది. రోగులకు తక్షణ ఉపశమనం కలిగించడం కోసం షెడ్యూల్- హెచ్ డ్రగ్స్, ప్రమాదకరమైన స్టెరాయిడ్లు, పెయిన్ కిల్ల ర్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను విచక్షణారహితంగా వాడుతున్నారు.

రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీలు), పారామెడికల్ ప్రాక్టీషనర్స్ (పీఎంపీలు) అసలు అల్లోపతి మందులు ప్రిస్క్రైబ్ చేయడానికే వీల్లేదు. కా నీ, జ్వరం, ఒంటినొప్పులు అని వెళ్లిన రోగులకు హెవీ డోస్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు.  ప్రభావం వల్ల రోగుల మూత్రపిండా లు, , కాలేయం పాడైపోతున్నాయి. కొన్ని చోట్ల డిస్టిల్ వాటర్‌ను ఇంజెక్షన్లుగా ఇస్తూ అమాయకులను ముంచుతున్నారు. 

టీజీఎంసీ నంబర్లు దుర్వినియోగం

నకిలీలు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారంటే, ఎక్కడో హైదరాబాద్ లోనో లేదా ఇతర జిల్లాల్లో ఉన్న అసలైన అర్హత గల డాక్టర్ల టీజీఎంసీ రిజిస్ట్రేషన్ నంబర్లను వీరు దొంగిలించి, తమ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లపై ము ద్రిస్తున్నారు. తనిఖీలకు అధికారులు వచ్చినప్పుడు ఆ నంబర్లను చూపించి తప్పించు కునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేని లాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ఈ నకిలీలే నడుపుతున్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టంలోని సెక్షన్ 34, 54 ప్రకారం, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ (టీఎంపీఆర్) యాక్ట్ ప్రకారం గుర్తింపు పొందిన వైద్యులు తప్ప ఇతరులు వైద్యం చేస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ, తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందనే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి.

ఉమ్మడి మెదక్‌లో నకిలీలదే హవా

సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట ఏరియా ఆసుపత్రిలో తాజాగా వెలుగు చూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడ నైట్ డ్యూటీ చేయాల్సిన డిప్యూటీ సివిల్ సర్జన్ విధులకు రాకుండా, ఒక ప్రైవేట్ వ్యక్తిని తన స్థానంలో కూర్చోబెట్టాడు. సదరు నకిలీ డాక్టర్  రాత్రంతా ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు వైద్యం అందించాడు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు.

సదరు ప్రభుత్వ వైద్యుడిని సస్పెండ్ చేయడమే కాకుండా, నకిలీ వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గత మే నెలలో నకిలీ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ పట్టుబడిన విషయం తెలిసిందే. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ బృందానికి అందిన రహస్య సమాచారం మేరకు సిద్దిపేట శివాజీనగర్‌లోని లలితా భవాని ఆసుపత్రిపై అధికారులు ఆకస్మిక దాడి చేశారు.

ఎలాంటి గుర్తింపు పొందిన మెడికల్ డిగ్రీ లేకపోయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు, అలాగే డీఈఎం, ఈఈసీఎం వంటి అత్యవసర వైద్య సర్టిఫికెట్లు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. మరో విషయం ఏమిటంటే పట్టుబడటానికి ముందు దాదాపు ఒక సంవత్సరం కాలంగా ఆసుపత్రిలోని అత్యవసర నిఘా విభాగంలో (ఐసీయూ) ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఇతనే చికిత్స అందిస్తున్నాడు.

అధికారులు విచారణ అనంతరం అజయ్ కుమార్ను పోలీసులకు అప్పగించగా, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా పరిధిలోని తూప్రాన్, చేగుంట, రామాయంపేట, టేక్మాల్ మండలాల్లో నకిలీల హవా విచ్చలవిడిగా సాగుతోంది. తూప్రాన్ పట్టణంలో కనీస ఫస్ట్‌ఎయిడ్ అర్హత కూడా లేని ఒక వ్యక్తి పెద్ద క్లినిక్ ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా రోగులకు అల్లోపతి చికిత్స అందిస్తుండగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడి చేసి సీజ్ చేశారు.