రైతుల భూములు లాక్కోవద్దు
కంకణాలగూడెం సర్పంచ్ వీరేశ్ గౌడ్
సంస్థాన్ నారాయణపూర్,ఆగస్టు 7 :నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని 164 సర్వే నెంబరు భూమిని గతంలో 65 సంవత్సరాల క్రితం గ్రామ రైతులకు కేటాయించడం జరిగిందని ప్రస్తుతం ఆ భూములలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కంకణాలగూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్ అన్నారు.రైతులకు కేటాయించిన భూములు కాకుండా వేరే భూములు ఎంపిక చేసి మండల క్రీడాప్రాంగణం నిర్మాణం చేపట్టాలని,
రైతులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కున్నట్లయితే వారి కుటుంబాలు రోడ్డున పడి ఆర్ధికంగా దెబ్బతినే అవకాశం ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి మండల క్రీడాప్రాంగణం మరో చోట ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు సంపతి సుధాకర్ రెడ్డి, సామ పవన్ రెడ్డి, ఎలిమినేటి లింగారెడ్డి, సంపతి శివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






