7 June, 2026 | 4:02 AM

భారత్‌పై ఆంక్షలు పెడితే.. మీకే దెబ్బ

07-06-2026 01:09 AM

పశ్చిమదేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్

మాస్కో, జూన్ 6: ఆంక్షల రూపంలో భారత్‌ను ఇబ్బంది పెడితే.. అవి తిప్పి కొడతాయంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. రష్యాతో సంబంధాల విషయంలో కూడా మున్ముందు అలాగే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్ బర్గ్ జరుగుతోన్న ఆర్థిక సదస్సులో పుతిన్ మాట్లాడారు.

భారత్ సార్వభౌమాధికార దేశమని, ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే... అవి వారికే ఎదురుదెబ్బలవుతాయని హెచ్చరించారు. అక్కడి ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ దేశానికి స్వేచ్ఛ ఉందని, ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. భారత్ వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.

ఎస్‌యూ-57, ఎస్-500 వంటి రష్యా రక్షణ ఉత్పత్తులను భారత్ ఒకవేళ కొనుగోలు చేస్తే.. అమెరికా నుంచి ఆంక్షలు ఎదురుకావొచ్చేమోనని అడిగిన ప్రశ్నకు పుతిన్ బదులిచ్చారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని భారత్ అవలంబిస్తోందని పేర్కొన్నారు.