7 June, 2026 | 2:22 AM

ఆర్థిక వృద్ధిని మరింత పెంచాలి

07-06-2026 01:11 AM
  1. పశ్చిమాసియా ప్రభావం దేశంపై పడొద్దు
  2. ఆర్థిక సలహామండలి సమావేశంలో ప్రధాని మోదీ
  3. ప్రాధాన్యతా రంగాల రుణాల్లో మార్పులు చేయాలి
  4. ఆర్థికం నుంచి సామాజిక సమానత్వానికి మార్చాలి
  5. ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలి సూచన

న్యూఢిల్లీ, జూన్ 6 (విజయక్రాంతి): భారతదేశంలో వృద్ధి వేగాన్ని పెంచడం, ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడం, ప్రపంచ అనిశ్చితులు, సంఘర్షణల ప్రభావాన్ని దేశంపై పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిక సలహామండలి సభ్యులకు సూచించారు. శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కళ్యాణ్‌మార్గ్ పీఎం కార్యాలయంలో ఆర్థిక సలహామండలి సభ్యులతో (పీఎం -ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్) అత్యున్నత సమావేశం నిర్వహించారు.

ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, సరఫరా, డిమాండ్ వంటి వాటిపై ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించారు. తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై చర్చించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం మధ్య స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే వృద్ధి పంథాను కొనసాగించే లక్ష్యంతో అధికారులు ప్రధాని మోదీతో అభిప్రాయాలను, సూచనలను పంచుకున్నారు.

సంస్కరణలు, సామర్థ్యా న్ని పెంచడం, నిబంధనలు పాటించడం, పెట్టుబడులు, వ్యవస్థాపకతకు మరింత అనుకూల మైన వాతావరణాన్ని సృష్టించడంపై మాట్లాడారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలికంగా కొన సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త మార్కెట్లలో అనిశ్చితులను పెంచుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇంధన మార్కెట్లు, వాణిజ్య మార్గాలపై ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని మోదీ విస్తృతంగా చర్చలు జరిపారు.

ప్రాధాన్యతా రంగ రుణాల నిబంధనను ఆర్థిక సమాన త్వం నుంచి సామాజిక సమానత్వానికి మార్చాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) సూచించింది. ఎందుకంటే సామర్థ్యం తక్కువగా ఉండే రంగాలకు రుణాలను మళ్లించడం వల్ల మొత్తం కారకాల ఉత్పాదకతకు హాని కలిగించగలదని తెలిపింది. ‘ప్రాధాన్యతా రంగ రుణాల ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ అనే శీర్షికతో విడుదల చేసిన ఒక వర్కింగ్ పేపర్‌లో, చిన్న, సన్నకారు రైతులు (ఎస్‌ఎఫ్‌లు/ఎంఎఫ్‌లు), చిన్న తరహా పరిశ్రమలు, బలహీన వర్గాలకు రుణాలను అందుబాటులోకి తీసుకొచ్చి, దాన్ని అసలు లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది.

పాధాన్యతా రంగ రుణాల (పీఎస్‌ఏల) దృష్టిని ఆర్థిక సమానత్వం నుంచి సామాజిక సమానత్వం వైపు మళ్లించాలని చెప్పింది. ఇకపై అప్రస్తుతంగా ఉన్న పాత చేర్పులను తొలగించవచ్చని కూడా సూచించింది. దీనికి అనుగుణంగా లక్ష్యాలను సర్దుబాటు చేసే వీలుంది. అదేవిధంగా, సూక్ష్మ సంస్థలు, బలహీన వర్గాలకు ఉన్న ఉప-లక్ష్యాన్ని కొనసాగి స్తూనే, ప్రాధాన్యతా రంగం నిబందనల నుంచి ఇతరులను తొలగించి, మొత్తం లక్ష్యాన్ని తగ్గించవచ్చని కూడా పేర్కొంది.

ఈ మార్పులతో, పీఎస్‌ఏల సామాజిక లక్ష్యాలపై ప్రాధాన్యతను పునరుద్ధరిస్తూనే, మూలధనాన్ని కేటాయించడంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు లభిస్తుందని తెలిపింది. అయితే నిర్దేశిత రుణ విధానాలు గణనీయమైన ఆర్థిక నష్టాలతో కూడా ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో ప్రాధాన్యతా రంగ రుణాల విధానం దాదాపు ఐదు దశాబ్దాలుగా అమలులో ఉంది. బ్యాంకులు తమ మొత్తం రుణంలో కనీసం 40 శాతాన్ని ప్రాధాన్యతా రంగానికి మళ్లించాల్సి ఉంటుంది.

ఈ సమావేశంలో ప్రధానమంత్రికి చెందిన ఇద్దరు ముఖ్య కార్యదర్శులు - పీకే మిశ్రా, శక్తికాంత దాస్, ఈఏసీ చైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ సభ్యులు సంజయ్ కుమార్ మిశ్రా, సంజీవ్ సన్యాల్, షమికా రవి, రాకేష్ మోహన్, సాజిద్ జె.చినోయ్, నీలకంఠ్ మిశ్రా, నీలేష్ షా, టీటీ రామ్ మోహన్, సౌమ్య కాంతి ఘోష్, కేవీ రాజు, చేతన్ ఘాటే, పామీ దువా, పులక్ ఘోష్, గౌరవ్ వల్లభ్ పాల్గొన్నారు.