23 August, 2026 | 12:50 AM

క‌లెక్ట‌రేట్‌ను ఇడియ‌ట్స్ న‌డిస్తున్నారు

22-08-2026 11:56 PM

- పోలీసులపై ఫైర్ అయిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ 

- 22ఏ నిషేధిత భూముల వినతి కోసం వచ్చిన బీజేపీ నాయకులు 

- కలెక్టరేట్ లోకి అనుమతించని పోలీసులు

- కలెక్టరేట్ గేటుకు వినతి పత్రం ఇచ్చిన నాయకులు

మంచిర్యాల,(విజయక్రాంతి):  మంచిర్యాల కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ను మూర్ఖుల గుంపు,  'ఎ బంచ్ ఆఫ్ ఇడియట్స్, జోకర్లు' నడుపుతున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం 22ఏ నిషేధిత భూములపై బీజేపీ నాయ‌కులు క‌లెక్ట‌రేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద వారిని లోప‌లికి వెళ్ల‌కుండా పోలీసులు గేట్లు మూసి అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహానికి గురైన రఘునాథ్ కలెక్టరేట్ ను మూర్ఖుల గుంపు న‌డిపిస్తోందని, క‌లెక్ట‌ర్ కు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తోందా..? అంటూ ప్ర‌శ్నించారు. గంజాయి బ్యాచ్ రాజకీయం చేస్తుంటే అడ్డుకోలేని మీరు సామరస్యంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా..? కలెక్టర్ ఎప్పుడో బ‌దిలీ కావాల్సి ఉంద‌ని, ఇన్ని రోజులు ఒక్క‌చోటే ఉంటే ఇలాంటి స‌మ‌స్యలే ఉంటాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాము ధర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం లేద‌ని, జెంటిల్‌మెన్‌లా మెమొరాండం ఇవ్వడానికి వస్తే అడ్డుకోవ‌డం ఏమిట‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారుల దాగుడుమూతలపై అసహనం వ్యక్తం చేశారు. వినతి పత్రం తీసుకునేందుకు ఒకసారి కలెక్టర్ వస్తాడంటారు, ఇంకోసారి జేసీ, డీఆర్వో, ఏవో వస్తారని మార్చి మార్చి చెబుతున్నారు, ఇంత పెద్ద కలెక్టరేట్ కట్టింది ప్రజలు లోపలికి రాకుండా ఆపడానికా..? అంటూ యంత్రాంగం తీరును తప్పుబట్టారు. తెల్లవారులేస్తే భజన చేయడమే సరిపోతుందన్నారు. బీజేపీ కార్పొరేటర్లు సమస్యలపై వస్తే, మీరు బీజేపీ వాళ్లు, మీ పనులు ఎందుకు చేస్తామని అంటున్నారట.., వీళ్లకు జీతాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందా..? అని మండిపడ్డారు.

ఆ త‌ర్వాత ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ జీ ఓ ల పేరిట పేద మధ్య తరగతి ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ పార్టీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 22 ఏ జీ ఓ లో అనేక తప్పిదాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర మంత్రులు ఒప్పుకున్నారని, జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ద్వారానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పట్టి వెంకట కృష్ణ, రమణ రావు, కమలాకర్ రావు, ఆకుల అశోక వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ సప్న రాణి, బొడ్డు రఘునందన్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కస్తూరి నాగరాజు, బోట్ల సత్యం, బింగి ప్రవీణ్, నల్ల రవి, మద్ది సుమన్, రాకేష్ రెన్వ, సల్ల సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.