పోడు రైతులకు అండగా ఉంటా.. అధైర్యపడొద్దు
ఎమ్మెల్యే పాయం
అశ్వాపురం, జూలై 21, (విజయక్రాంతి): పోడు భూముల సమస్యపై గిరిజన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భరోసా ఇచ్చారు. మంగళవారం అశ్వాపురం మండలంలోని వేములూరు, మనుబోతులపాడు గ్రామాల్లో ఇటీవల చోటుచేసుకున్న పోడు భూముల ఘటనల్లో బాధితులైన గిరిజన రైతులను ఆయన పరామర్శించారు.
వేములూరు గ్రామ పరిధిలో ఘటనలో గాయపడిన పోడు రైతులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక సర్పంచ్, అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్బాబును వారితో పాటు భద్రాచలం పంపించారు. అనంతరం మనుబోతులపాడులో అటవీశాఖ అధికారుల దాడిలో గాయపడిన గిరిజనులను పరామర్శించారు.
గిరిజన మహిళలపై బూట్లు, కర్రలతో దాడి చేయడం, ఒక మహిళను జుట్టు పట్టుకుని లాగి కిందపడేసి కాలితో తొక్కడం వంటి ఘటనలు అమానుషమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనులపై దురుసుగా ప్రవర్తించిన అధికారులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారి సంపత్ను సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్‌ఆర్‌ఓతో పాటు మరో ముగ్గురు అధికారులకు మెమోలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్బాబు, నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






