హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్ కృష్ణారెడ్డి
- లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని పిటిషన్
- నేడు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
రంగారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి): తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తన ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, తన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని, అందులోని వ్యక్తిగత సంభాషణలు చదివి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని, తన ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి, వాటిని తన భర్తకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ అసత్య ప్రచారాలు చేశాడంటూ ఉదయ్ కృష్ణారెడ్డిపై ట్రైనీ మహిళా ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి ఖండించారు. తనపై కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరిన ఆయన, తన వైపు వాదనను వినిపిస్తూ ‘బాధితురాలే స్వయంగా నా గదిలోకి వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంది. నాపై కావాలనే కుట్రపూరితంగా ఈ అబద్ధపు కేసులు బనాయించారు’ అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తున్నది.






