రూ.100 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
- మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో భారీ ఆపరేషన్
- క్రీడా మైదానంలో అక్రమ కట్టడాలు తొలగింపు
- నిర్మాణంలో ఉన్న ఐదు భవనాలు కూల్చివేత
హైదరాబాద్, ఏప్రిల్ ౧(విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురం కాలనీలో బుధవారం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.క్రీడామైదానంలో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టింది. భారీ భద్రత నడుమ ఈ కూల్చివేత ప్రక్రియను పూర్తిచేశారు. నిర్మాణ దశలో ఉన్న ఐదు భవనాలను నేలమట్టం చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైడ్రా ఆక్రమణల తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆమోదించిన 188 ఎకరాల లేఅవుట్లో 6,500 చదరపు గజాల స్థలాన్ని ఆటస్థలం కోసం కేటాయించారు. అయితే, కొందరు వ్యక్తులు ఈ భూమిని కబ్జా చేసి, నకిలీ నోటరీ పత్రాలతో ఇతరులకు ప్లాట్లుగా విక్రయించారు.ఈ స్థలంలో నిర్మాణంలో ఉన్న ఐదు జీ ప్లస్ 3 భవనాలతో పాటు మరో రెండు చిన్న నిర్మాణాలను కూడా హైడ్రా బృందాలు నేలమట్టం చేశాయి.
మరో రెండు భవ నాల్లో కొన్ని కుటుంబాలు నివసిస్తుండటంతో మానవతా దృక్పథంతో వాటిని కూల్చివేయలేదు.గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ కబ్జాదారులకు నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. స్థానికుల నుంచి అందిన ఫిర్యా దులతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, కబ్జాలను నిర్ధారించుకున్న తర్వాత ఈ చర్యలు చేప ట్టారు.
కాగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు 2024లో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రూ.60వేల కోట్ల విలువైన 1,045 ఎకరాల ప్రభు త్వ భూము లు, జలవనరులను తిరిగి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో బంజారాహిల్స్‌లోని 750 కోట్ల రూపాయల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.




