2 April, 2026 | 2:27 AM

చికెన్ షాపులు బంద్

02-04-2026 12:41 AM

పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించినందుకు..

  1. రిటైల్ వ్యాపారుల సమ్మెబాట 
  2. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ కొరత 
  3. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : తెలంగాణలో చికెన్ ప్రియులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆహారంలో భాగంగా చికెన్‌ను వినియోగించే లక్షలాది మందికి ఇప్పుడు చికెన్ దొరకడం కష్టంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బుధవారం మూతపడ్డాయి. షాప్‌ల మూసివేత నిరవధికమని రిటైల్ వ్యాపారులు ప్రకటించారు. దీనితో మార్కెట్ ఒక్కసారిగా స్తంభించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ను తగ్గించినందుకు నిరసనగా రిటైల్ వ్యాపారు లు సమ్మె బాట పట్టారు.

లాభాల మార్జిన్ తీవ్రంగా తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు అమాంతం పెరగడం వంటి కారణాలతో  తెలంగాణ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 50 వేలకుపైగా చికెన్ దుకాణాలు ఉండగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 25 వేల షాపులు ఉన్నాయి. రోజూ 18 నుంచి 20 లక్షల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరిగే ఈ భారీ వ్యాపార రంగం ఒక్కసారిగా నిలిచిపోవడంతో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,500 దుకాణాలు మూతపడగా, నాగర్‌కర్నూల్ సహా పలు జిల్లాల్లో వ్యాపారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇప్పటికే చికెన్ నిల్వలు షాపుల్లో పేరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం, గతంలో కిలో చికెన్‌పై రూ. 25- వరకు లాభం వచ్చేది.

అయితే ప్రస్తుతం అది రూ. 5 పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మార్జిన్ రూ. 26 నుంచి రూ. 16కు తగ్గించడంతో చివరికి చేతిలో మిగిలేది ఐదు రూపాయలు మాత్రమేనని వారు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం అసాధ్యమైందని, నష్టాల్లో నడిపే కంటే దుకాణాలు మూసివేయడమే మేలని వారు భావిస్తున్నారు.

ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా..

లాభాలు తగ్గడమే కాకుండా ఖర్చులు విపరీతంగా పెరగడం వ్యాపారులను మరిం త కష్టాల్లోకి నెట్టింది. షాపుల అద్దెలు గణనీయంగా పెరిగాయి. విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. రవాణా ఖర్చులు అధికమయ్యాయి. కార్మికుల జీతాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఇరవై ఏళ్ల క్రితం ఒక కార్మికుడికి నెలకు రూ. 5,000 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు అదే వేతనం రూ. 20,000 వరకు చేరింది. ఒక్కో షాపులో కనీసం ముగ్గురు పనిచేస్తుండటంతో ఖర్చులు భారీగా పెరిగాయి.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుత మార్జిన్‌తో వ్యాపారం కొనసాగించడం సాధ్యంకాదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునివ్వడంతో ఈ ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. కిలో చికెన్‌పై లాభాన్ని కనీసం రూ. 40కి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, పౌల్ట్రీ కంపెనీలు చర్చలకు రాకపోతే బంద్‌ను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పౌల్ట్రీ రంగం పూర్తిగా కార్పొరేట్ కంపెనీల ఆధీనంలోకి వెళ్లిందని చిన్న వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

పెద్ద కంపెనీలు తక్కువ మార్జిన్‌తో సరఫరా చేసి, చిన్న రిటైలర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అంటున్నారు. తమకు సరైన కమిషన్ ఇవ్వకుండా వ్యాపారాన్ని కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది తమ మనుగడకే ముప్పుగా మారిందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరల నియంత్రణ, మార్జిన్ విషయంలో స్పష్టమైన విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

వినియోగదారులపై ప్రభావం..

ఇక గుడ్ల మార్కెట్లో కూడా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగరంలో ఒక్క గుడ్డు ధర రూ. 7 నుంచి రూ. 5కు పడిపోయింది. దీనికి ఇరాన్ అమెరికా యుద్ధమే ప్రధాన కార ణంగా మారింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల పశ్చిమ ఆసియా దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో భద్రతా సమస్యలు తలెత్తడంతో సరుకు రవాణా అంతరాయం కలిగింది.

దీంతో స్థానిక మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు పడిపోయాయి. ఇది కోళ్ల పెంపకందారులకు మరో పెద్ద దెబ్బగా మారింది. చికెన్ షాపు లు మూతపడటంతో హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. చికెన్ వంటకాలపై ఆధారపడే వ్యాపారాలు దెబ్బతిన్నాయి. 

వినియోగదారులకు కూడా చికెన్ అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. బ్లాక్ మార్కెట్ ప్రమాదం కూడా ఉందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే చికెన్ మార్కెట్లో సంక్షోభం తలెత్తే అవకాశముంది. ఒకవైపు లాభాల కోసం పోరా డు తున్న వ్యాపారులు, మరోవైపు స్పందించాల్సిన ప్రభుత్వం.. చివరకు సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారు.