2 April, 2026 | 3:49 AM

కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలి

02-04-2026 01:36 AM
  1. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ
  2. పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్‌ను కాజీపేట డివిజన్‌లోనే ఉంచాలన్న కేటీఆర్
  3. లేఖను మంత్రికి అందజేసిన బీఆర్‌ఎస్ ఎంపీలు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర మంత్రికి స్వయంగా అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సాను కూలంగా స్పందించారు.

దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబాద్ డివిజన్‌పై పనిభారం విపరీతంగా పెరిగిం దని కేటీఆర్ తన లేఖలో ఎత్తిచూపారు. తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, రాబోయే కాలంలో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తయితే, ఇది సు మారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకా రం ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని వివరిం చారు. మిగతా డివిజన్లతో పోలిస్తే సికింద్రాబాద్‌పై ఉన్న ఒత్తిడిని కేటీఆర్ వివరిస్తూ.. విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉందని గుర్తుచేశారు.

అనేక చోట్ల ప్రతిపాదిత కాజీపేట డివిజన్ కన్నా తక్కువ కిలోమీటర్లు ఉన్న డివిజన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయడం అటు పరిపాలన సౌలభ్యం, ఇటు కార్యకలాపాల రీత్యానూ అత్యంత అవసరమని ఆయ న స్పష్టం చేశారు. 

రైల్వే హబ్‌గా కాజీపేట్

ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌లో కాజీపేట-బల్లార్షా, పెద్దపలి-నిజామాబాద్, కాజీపేట- ఎర్రు పాలెం, డోర్నకల్-మనుగూరు, సత్తుపల్లి వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల నెట్వర్క్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని కేటీఆర్ సూచించారు. పెద్దపల్లి- సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళిక సామీప్యత దృష్ట్యా దానిని కాజీపేట డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

లాతూర్ రోడ్--పర్లీ వైజనాథ్ సెక్షన్‌ను నాందేడ్ డివిజన్‌ను మార్చే అం శాన్ని కూడా పునఃపరిశీలించాలని విన్నవించారు. కాజీపేట ప్రధాన రైలు మార్గాల కూడలిలో ఉండటం, అక్కడ ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్, మహబూబాబా ద్‌లో మెయింటెనెన్స్ కేంద్రాల అభివృద్ధి జరుగుతున్నందున, ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో కీలక రైల్వే హబ్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైల్వేకు ఈ ప్రాం తం నుండి భారీ ఆదాయం లభిస్తుందని, ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్గాలపై ప్రత్యేక పరిపాలనా పర్యవేక్షణ ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న ఆర్థిక భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని, తద్వారా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడటమే కాకుండా, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.