వాణిజ్య సిలిండర్ రూ. 195 పెంపు
- విమాన ఇంధన ధరలు రెట్టింపు
- ఇండిగో చార్జీల బాదుడు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పశ్చిమాసియా లో ఉద్రిక్తతలు భారత్‌లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. బుధ వారం ప్రభుత్వరంగ చమురు సంస్థలు 19, 5 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 5 కిలోల చిన్న సిలిండర్ ధర ను రూ. 51 పెంచగా, 19 కిలోల సిలిండర్ ధరను రూ. 195కు పెంచాయి. దీంతో కొత్త ధరతో వాణిజ్య సిలిండర్ రూ. 2,000లకు పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ఢిల్లీలో రూ. 2,078.50, ముంబైలో రూ. 2,031, చెన్నైలో రూ. 2246.50, కోల్‌కతాలో రూ. 2208, హైదరాబాద్‌లో రూ. 2,321కు చేరుకుంది.
పశ్చి మాసియా దేశాల్లో యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ప్రపంచ చమురు ధర లు 50 శాతానికి పెరిగాయి. కీలక ఇం ధన మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం, నౌకలను అడ్డుకోవడంతో ఇంధన సంక్షోభం తలెత్తింది. చమురు ధరల పెరుగుదల కారణం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించాల్సి వచ్చింది. పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలతో సహా వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ, గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి మినహాయింపు లభించింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) వంటి ప్రధాన చమురు కంపెనీలు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్, కరెన్సీ మార్పిడి రేట్లను పరిగణనలోకి తీసుకొని, ప్రతి నెలా ఒకటో తేదీన ఈ రేట్లను సవరిస్తాయి. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే సిలిండర్ ధరల బాంబు పేలడంతో మున్ముందు మరిన్ని వడ్డింపులు ఉండొచ్చని భావిస్తున్నారు.
టికెట్ల ధరలు పెంచిన ఇండిగో..
యుద్ధం ప్రభావం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై పడింది. తొలిసారి రికార్డు స్థాయిలో ధర పెరిగి రూ. 2 లక్షల మార్క్ దాటింది. దీంతో విమాన ప్రయాణికులపై ఈ భారం పడనుంది. ఏటీఎఫ్ ధరలను చమురు సంస్థలు సవరించాయి. కిలో లీటర్ ఏటీఎప్ ధర రూ. 1,10,703 పెరిగి ఢిల్లీలో రూ. 2,07,341కి చేరింది. గతంలో కిలో లీటర్ కు రూ. 96,638 ఉండగా, ప్రస్తుతం 114.5 శాతం మేర పెరుగుదల నమోదైంది.
ఈ పెంపును పాక్షికంగా, దశలవారీగా మాత్రమే బదిలీ చేశామని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశీయ విమానయాన సంస్థలకు ఈ పెంపు 8.5 శాతం మాత్రమే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయాల్లో 40 శాతం ఇంధన ధరలకే వెచ్చించాల్సి వస్తుంది. ఏటీఎఫ్ ధరల పెరుగుదలతో విమాన టికెట్ల ధరల పెంపుదలను ఇండిగో సంస్థ ప్రకటించింది. దేశీయ సర్వీసులకు రూ. 275 నుంచి రూ. 950 పెంచుతున్నట్లు, అంతర్జాతీయ సర్వీసులకు రూ. 900 నుంచి రూ. 10,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది.




