2 April, 2026 | 2:26 AM

ఎల్‌అండ్‌టీపై ప్రేమ.. ఆర్టీసీపై కక్ష!

02-04-2026 12:49 AM

* హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను టేకోవర్ చేసుకునేందుకు రూ. 15,000 కోట్లు ఎల్ అండ్ టీకి ఇచ్చేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వానికి.. ఆర్టీసీకి ఉన్న రూ. 15 వేల కోట్ల అప్పులు తీర్చేందుకు మాత్రం మనసు రావడం లేదు. ఆర్టీసీ కార్మికులకే రూ. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కింద ఆర్టీసీకి రూ. 2,500 కోట్ల బకాయి పడింది. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తోన్న ఆర్టీసీపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు ఆర్టీసీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

మార్చి 28న మెట్రోపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

* ‘మెట్రో రెండో దశను చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో ఫేజ్-1ను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాల ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలనే వివిధవర్గాల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఫేజ్-2 ఏ, బీలను ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న అడ్డంకులను, సమస్యలను లోతుగా సమీక్షించాం. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో ఫేజ్-1 నెట్‌వర్క్‌ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయంచాం. దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాం’   

  1. రూ.15 వేల కోట్లతో ప్రభుత్వం మెట్రో స్వాధీనం
  2. ఆర్టీసీకి రూ.15 వేల కోట్ల అప్పున్నా పట్టని సర్కారు
  3. సంస్థ కార్మికులకే రూ.10 వేల కోట్ల బకాయిలు
  4. మహిళల ఉచిత ప్రయాణం కింద రూ.2,500 కోట్లు పెండింగ్
  5. ఆర్టీసీ అప్పులూ తీర్చాలంటున్న కార్మిక సంఘాలు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కొత్తొక వింత.. పాతొక రోత.. సామెతను రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగా వంటబట్టించుకున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రజా రవాణాలో కొత్తగా పుట్టుకొచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్‌పై కురిపిస్తున్న ప్రేమను.. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీపై చూపకపోవడం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు భరోసాను కలిగిస్తూ ప్రతిరోజూ సుమారు 75 లక్షల మందిని.. శుభకార్యాలు, పండుగల సమయంలో కోటి మందికిపైగా ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సానుభూతిని వ్యక్తంచేయకపోగా తీసుకుంటున్న పలు నిర్ణయాలను చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంంగా వ్యవహరిస్తున్నట్టు కార్మికులు బలంగా ఆరోపిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలను ఎత్తిచూపుతున్నారు.

రూ.15 వేల కోట్లు ఇచ్చి మెట్రోను స్వాధీనం

తాజాగా హైదరాబాద్ మెట్రోను లార్సన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) నుంచి పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీకి ఉన్న సుమారు రూ.7 వేల కోట్ల విలువైన భాగస్వామ్యాన్ని, అలాగే ఎల్‌అండ్‌టీ తెచ్చిన సుమారు రూ.13,000 కోట్ల రుణాలను తామే టేకోవర్ చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు.

మెట్రో రెండో దశను చేపట్టాలంటే ప్రైవేటు సంస్థల పరిధిలో మెట్రో ఉండకూడదని కేంద్రం విధించిన నిబంధనల నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ, సెక్రటరీల కమిటీ, ఆర్థిక రంగ నిపుణుల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రూ.15,000 కోట్ల మొత్తాన్ని (ఎల్‌అండ్‌టీ షేర్లు, రుణాలు మొత్తం కలిపి) ఇచ్చి మెట్రో ఫేజ్ పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసి మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే సభ అనుమతికూడా తీసుకోవడం గమనార్హం.

అప్పుల్లో ఆర్టీసీ..

కేవలం రెండేండ్లలోనే అపారమైన ప్రేమను ఎల్‌అండ్‌టీపై కురిపించిన ప్రభుత్వం.. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్టీసీపై కురిపించడం లేదని, పైగా బకాయిలను చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వానికి పేరుతెచ్చిపెడుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నందున ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తంలో ప్రభుత్వం కోత పెడుతూవస్తున్నది.

ఈ మహాలక్ష్మి బకాయిలు కాస్తా రూ.2,500 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఆర్టీసీ చేసిన అప్పులు మరో రూ.3000 కోట్ల వరకు ఉన్నాయి. సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఇవ్వాల్సినవి సుమారు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. 2017 నుంచి ఆర్టీసీ కార్మికులకు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

రిటైర్డ్ అయిన ఉద్యోగులు, కార్మికులకు సెటిల్‌మెంట్ చేయాల్సినవి పెండింగ్‌లో ఉన్నాయి. సర్వీసులో ఉన్నవారికి పీఆర్సీలు, సీసీఎస్ సొసైటీకి రూ.800 కోట్లు, పీఎఫ్‌కు రూ.1,200 కోట్లు, ఎస్‌ఆర్‌బీఎస్ (ఎస్‌బీటీ)కి రూ.250 కోట్లు.. ఇలా మొత్తంగా సుమారు రూ.10 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని కార్మికులు చెప్తున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థ అంటే చేదా?

రూ.15 వేల కోట్లు చెల్లించి మెట్రోను స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వానికి ఉన్న ఉత్సాహం.. ఏండ్లుగా పేరుకుపోతున్న తమ బకాయిలు చెల్లించడంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రాంతాలను మాత్రమే కలుపుతూ నడుస్తున్న మెట్రో విషయంలో చాలా వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం..

దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. ముంబై, విజయవాడ, పుణె, షిర్డీ, చెన్నై, గోవా, తిరుపతి, నాగపూర్ లాంటి సుదూర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు, తెలంగాణ చుట్టూ ఉన్న మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు విరివిగా బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ అంటే ప్రభుత్వానికి కనీస సానుభూతి లేకుండా, కంటగింపుగా ఉండటాన్ని కార్మికులు వేలెత్తి చూపుతున్నారు. ప్రైవేట్ సంస్థ నడుపుతున్న మెట్రోపై నమ్మకాన్ని చూపిన ప్రభుత్వం.. దశాబ్దాలుగా నమ్మకంగా ప్రజా రవాణాలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీపై చూపకపోవడాన్ని కార్మికులు తప్పుబడుతున్నారు.

రూ.15 వేల కోట్లతో మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం అదే రూ.15 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉన్న ఆర్టీసీని కూడా ఆదుకోవాలని, ఆ మొత్తాన్ని చెల్లించి, అప్పుల నుంచి బయటపడేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీపై ప్రేమ చూపించి, ప్రభుత్వ రంగ సమస్థపై కక్ష సాధింపు చర్యలకు దిగితే తెర వెనుక కుట్ర ఉందనే అనుమానాలు మరింత బలపడక తప్పదని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీని ఎలాగైనా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే కార్మికులు, ఆర్టీసీ సంస్థ భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. కనీసం ఈవీ బస్సులను ఆర్టీసీ సంస్థ సొంతంగా కొనుగోలు చేసేలా నిర్ణయాన్ని తీసుకోకపోవడాన్ని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.